13 May, 2026 | 2:23 AM

సెన్సన్‌లో హౌసింగ్ మ్యాపింగ్‌పై కమిషనర్ ప్రత్యేక దృష్టి

13-05-2026 01:36 AM

కల్లూరు, మే 12 (విజయక్రాంతి): కల్లూరు మున్సిపాలిటీలో కొనసాగుతున్న సెన్సస్ ప్రక్రియలో భాగంగా హౌస్ మ్యాపింగ్ విధానాన్ని మున్సిపల్ కమిషనర్ సిహెచ్ రాజశేఖర్ మంగళవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి సిబ్బంది నిర్వహిస్తున్న వివరాల సేకరణ, మ్యాపింగ్ పనితీరును ఆయన సమీక్షించారు.

ఈ సందర్భంగా ప్రతి ఇంటి వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలని, ఎలాంటి పొరపాట్లు లేకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.ప్రజలతో సానుకూలంగా వ్యవహరిస్తూ అవసరమైన సమాచారాన్ని సమగ్రంగా సేకరించాలని తెలిపారు.

అనంతరం స్థానికులతో మాట్లాడి సెన్సస్ ప్రాముఖ్యతను వివరించారు.హౌస్ మ్యాపింగ్ ద్వారా పట్టణ అభివృద్ధి ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయడానికి అవసరమైన డేటా లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డు కౌన్సిలర్ జిల్లెల్ల స్వాతి, మున్సిపల్ సిబ్బంది,ఫీల్ ఎన్యూమరేటర్లు, సర్వేయర్లు, స్థానికులు పాల్గొన్నారు.