కమర్షియల్ గ్యాస్ ‘మంట’.. భారీగా పెరిగిన సిలిండర్ ధర
న్యూఢిల్లీ: పశ్చిమ ఆసియాలో విస్తరిస్తున్న సంఘర్షణ కారణంగా ప్రపంచ చమురు ధరలు భారీగా పెరగడంతో బుధవారం నాడు కమర్షియల్ ఎల్‌పీజీ (Commercial LPG cylinder price increases) ధరలు రూ. 195.50 మేర పెరిగాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థల వివరాల ప్రకారం, ఢిల్లీలో ప్రస్తుతం 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 2,078.50కి చేరింది. మార్చి 1న, 19 కిలోల సిలిండర్‌పై ధరలు చివరిసారిగా రూ. 114.5 పెంచబడ్డాయి. మార్చి 7న చివరిసారిగా 14.2 కిలోల సిలిండర్‌పై రూ. 60 మేర పెంచిన గృహ వినియోగ ఎల్‌పీజీ ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి.
ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర రూ. 913గా ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, అంతర్జాతీయ ప్రమాణాలు, మారకం రేటు ఆధారంగా ప్రతి నెల మొదటి తేదీన ఎటీఎఫ్, ఎల్.పి.జి ధరలను సవరిస్తాయి. పశ్చిమ ఆసియాలో యుద్ధం ఇంధన సరఫరా గొలుసులకు అంతరాయం కలిగించిన తర్వాత, ప్రపంచ చమురు ధరలు దాదాపు 50 శాతం భారీగా పెరిగాయి.
గత ఏడాది మార్చిలో లీటరుకు రూ. 2 తగ్గించినప్పటి నుండి పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగానే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 94.72, డీజిల్ ధర రూ. 87.62 గా ఉంది. హైదరాబాద్ లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ పై రూ. 194.50 పైసలు పెంచడంతో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 2,321కి చేరింది. కోల్‌కతాలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై రూ.218 పెంచారు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పు చేయాలేదని కేంద్రం ప్రకటించింది.




