సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
- వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి
- కళాశాల విద్యార్థులకు ‘సైబర్ జాగూరుకత’ సదస్సు
ఎల్బీనగర్: సైబర్ నేరాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి సూచించారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి ఆదేశాలతో బుధవారం వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కళాశాల విద్యార్థులు, ప్రజలకు బుధవారం "సైబర్ జాగూరుకత" అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇంజాపూర్ సంజీవని వనం పార్క్, ఎన్జీవోస్ కాలనీలోని వివేకానంద పార్క్, ఆటోనగర్ డీర్ పార్కులో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం బీఎన్ రెడ్డి డివిజన్ సాగర్ కాంప్లెక్స్ లోని కృష్ణవేణి కళాశాలలో సుమారు 300 మంది విద్యార్థులకు ప్రత్యేక సదస్సు నిర్వహించి సైబర్ నేరాలపై వివరించారు.
ఈ సందర్భంగా ఏసీపీ కాశిరెడ్డి మాట్లాడుతూ... ప్రస్తుతం పెట్టుబడుల పేరుతో మోసాలు, ఉద్యోగాల పేరుతో మోసాలు, ఓటీపీ ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్ట్, ఫోటో మార్ఫింగ్, డేటా హ్యాకింగ్, ఆన్‌లైన్ మోసాలు అధికమవుతున్నాయని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులకు బ్యాంకు వివరాలు, ఓటీపీలు, వ్యక్తిగత సమాచారం ఇవ్వవద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 సైబర్ హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్స్ ఏసీపీ శివశంకర్, వనస్థలిపురం ఎస్‌హెచ్‌వో రవిబాబు, సైబర్ క్రైమ్స్ ఇన్‌స్పెక్టర్లు కృష్ణంరాజు, నాగచారి, ఎస్సైలు గిరీష్, నాగరాజు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.






