13 May, 2026 | 3:39 AM

కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్!

13-05-2026 12:39 AM
  1. మేడ్చల్ పెద్ద చెరువు సర్వే చేయాలని ఆదేశం 
  2. ఇంతవరకు సర్వే చేయని అధికారులు 
  3. మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం 
  4. ప్రహసనంగా మారిన ప్రజావాణి కార్యక్రమం 
  5. అధికారుల నిర్లక్ష్యంతో చెరువు కట్టకు ర్యాంపుల నిర్మాణం 

మేడ్చల్, మే 12(విజయ క్రాంతి): మేడ్చల్ పెద్ద చెరువు సర్వే చేయాలని కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను స్థానిక అధికారులు బెఖాతరు చేస్తున్నారు. పెద్ద చెరువు కట్టకు ర్యాంపు నిర్మించారని, కట్ట బఫర్ జోన్లో అక్రమ నిర్మాణం చేపడుతున్నారని, చెరువులోకి డ్రైనేజీ నీరు మళ్లిస్తున్నారని స్థానికులు ఏప్రిల్ 6వ తేదీన ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. జాయింట్ సర్వే చేయాలని మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు వెంటనే కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

ఏప్రిల్ 18న సర్వే చేయాల్సి ఉండగా, టీపిఓ రాకపోవడంతో సర్వే రద్దయింది. ఆరోజు సర్వే రద్దు అయితే మళ్లీ ఎప్పుడు సర్వే నిర్వహించాలో నిర్ణయించాల్సి ఉండగా, అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏప్రిల్ 18 తర్వాత స్థానికులు జిల్లా ప్రజావాణిలో, మున్సిపల్ కార్పొరేషన్ సర్కిల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ కు పలుమార్లు వినతిపత్రం సమర్పించారు. అయినప్పటికీ అధికారుల నుంచి స్పందన లేదు. ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తులకు స్పందన లేదని, ఈ కార్యక్రమం ప్రహసనంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

కట్ట బఫర్ జోన్ లో నిర్మాణాలు 

చెరువు కట్ట బఫర్  జోన్ లో ఎలాంటి నిర్మాణాలు చేయడానికి వీలు లేదు. అంతేగాక చెరువు కట్టను ధ్వంసం చేయడం, ఆకృతి మార్చడం వంటివి కూడా చేయడానికి వీలు లేదు. కానీ పెద్ద చెరువు కట్ట బఫర్ జోన్ లో, ఎఫ్ టి ఎల్లో నిర్మాణాలు జరుగుతున్నాయి. రాకపోకలకు వీలుగా ర్యాంపు నిర్మించారు. ఈ విషయమై విజయక్రాంతి దినపత్రికలో ’మేడ్చల్ పెద్ద చెరువు చిన్న పోయింది!’శీర్షికన కథనం రావడంతో ఇరిగేషన్ అధికారులు స్పందించి ర్యాంపు ట్రెంచ్ కటింగ్ చేశారు.

కానీ తదుపరి చర్యలు తీసుకోలేదు. ర్యాంపు మొత్తం తొలగించాల్సి ఉండగా కాల్వ మాత్రమే తీశారు. అక్కడే బఫర్ జోన్ లోని అక్రమ నిర్మాణాన్ని కూల్చి వేయలేదు. వారం రోజుల్లో తొలగిస్తానని యజమాని హామీ ఇచ్చాడు. 40 రోజులు గడిచిన ఇంతవరకు యజమాని కూల్చలేదు. ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోలేదు. మరోచోట కూడా ర్యాంపు నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదివరకే కొద్దిగా మట్టి పోశారు. అధికారులు ఇలాగే నిర్లక్ష్యం చేస్తే మరికొన్ని ర్యాంపులు ఏర్పడే అవకాశం ఉంది. 

డ్రైనేజీ నీటితో కలుషితం 

మేడ్చల్ పెద్ద చెరువును డ్రైనేజీ నీటితో కలుషితం చేస్తున్నారు. ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కి చెందిన సిఎంఆర్ విద్యాసంస్థల నుంచి డ్రైనేజీ నీరు మొత్తం మేడ్చల్ పెద్ద చెరువులోకి వస్తోంది. గతంలో సుతారి గూడెం చెరువులోకి సిఎంఆర్ డ్రైనేజీ నీరు చేరేది. గ్రామస్తులు అభ్యంతరం చెప్పడంతో చెరువు ఎగువ భాగం నుంచి కాలువ తీసి మేడ్చల్ పెద్ద చెరువులోకి మళ్లిస్తున్నారు. కాలేజీ, హాస్టల్ లో సుమారు 5000 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల డ్రైనేజీ నీరు కూడా అదే స్థాయిలో వస్తోంది. వాస్తవానికి కాలేజీ యజమాన్యం సివవరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. కానీ ప్లాంట్ ఏర్పాటు చేయకుండా డ్రైనేజీ నీరును విడుదల చేస్తోంది. 

ఎఫ్ టి ఎల్ పరిధిలో విల్లాలు 

చెరువు ఎఫ్ టి ఎల్ పరిధిలో నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఒక విల్లా ప్రాజెక్టు చెరువు ఎఫ్ టి ఎల్ పరిధిలోనే ఉంది. ఎఫ్ టి ఎల్ పరిధిలో నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.