21 July, 2026 | 9:33 PM

Breaking News

నీట్ పరీక్ష పత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలి

21-07-2026 07:07 PM

విద్యార్థులపై లాఠీచార్జి, భాష్ప వాయు ప్రయోగాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: సీపీఎం

సత్తుపల్లి,(విజయక్రాంతి): నీట్ పరీక్ష పత్రాల లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించిన విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం అక్రమంగా లాఠీచార్జి చేయడం, భాష్ప వాయువు ప్రయోగించడం ప్రజాస్వామ్య హక్కులపై దాడి అని సీపీఎం సత్తుపల్లి పట్టణ కమిటీ తీవ్రంగా ఖండించింది.

ఈ సందర్భంగా సీపీఎం సత్తుపల్లి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం, ధర్నా నిర్వహించారు. సిపిఎం డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పాండురంగారావు నాయకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ పరీక్షలో జరిగిన పత్రాల లీకేజీ అత్యంత తీవ్రమైన ఘటన అని పేర్కొన్నారు.

ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా, తమ న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జి, భాష్ప వాయువు ప్రయోగించడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. విద్యార్థుల గొంతు నొక్కే ప్రయత్నాలను ప్రజలు ఎప్పటికీ సహించరని అన్నారు.

సీపీఎం డిమాండ్లు:

నీట్ పరీక్ష పత్రాల లీకేజీకి పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి.

నీట్ పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సమగ్ర దర్యాప్తు చేపట్టాలి.

విద్యార్థులపై జరిగిన లాఠీచార్జి, భాష్ప వాయు ప్రయోగానికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

దేశంలో పారదర్శకమైన, నమ్మకమైన పరీక్షా వ్యవస్థను ఏర్పాటు చేయాలి.

ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎం సత్తుపల్లి పట్టణ కమిటీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.