రైస్ మిల్లర్లు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
భైంసా,(విజయక్రాంతి): జిల్లాలో ధాన్యం కొనుగోలు, అన్‌లోడింగ్ ప్రక్రియను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడా జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. శనివారం లోకేశ్వరం మండలంలోని సాత్ గావ్, నగర్ గ్రామాల్లో ఉన్న రైస్ మిల్లులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను సమీక్షించారు. సాత్ గావ్ గ్రామంలోని శ్రీదుర్గా రైస్ మిల్లును సందర్శించిన కలెక్టర్, అక్కడ యంత్రాల సహాయంతో జరుగుతున్న ధాన్యం అన్‌లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు.
తనిఖీల సందర్భంగా మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్య, మిల్లుల నిల్వ సామర్థ్యం, ఇప్పటివరకు అన్‌లోడ్ చేసిన ధాన్యం పరిమాణం, ప్రస్తుతం పనిచేస్తున్న హమాలీల సంఖ్య తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. లారీల ద్వారా వచ్చే ధాన్యాన్ని వెంటవెంటనే అన్‌లోడ్ చేస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, పౌర సరఫరాల శాఖ అధికారులు రాజేందర్, సుధాకర్, లోకేశ్వరం తహసిల్దార్ సూర్యారావు తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






