పదవ తరగతి పరీక్షా కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): కొత్తగూడెం పట్టణంలో సోమవారం జిల్లా కలెక్టర్ అంకిత్ పదవ తరగతి వార్షిక పరీక్షలు జరుగుతున్న పలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సింగరేణి కాలరీస్ హై స్కూల్, సెయింట్ మేరీస్ హై స్కూల్, బాబు క్యాంపు పీఎం శ్రీ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్షల నిర్వహణపై సమగ్రంగా పరిశీలించారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సజావుగా జరుగుతున్నాయా అనే అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు.
పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై కలెక్టర్ ప్రత్యేకంగా ఆరా తీశారు. త్రాగునీరు, విద్యుత్, సరైన కూర్చునే ఏర్పాట్లు, గదుల పరిశుభ్రత, ప్రశాంత వాతావరణం వంటి అంశాలను పరిశీలించి, అవసరమైన చోట్ల తక్షణమే మెరుగులు చేర్చాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయగల వాతావరణాన్ని కల్పించాలన్నారు.
పరీక్షల నిర్వహణలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని, ఎలాంటి అక్రమాలు, మాల్‌ప్రాక్టీస్‌కు అవకాశం ఇవ్వకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల్లో నియమించిన ఇన్విజిలేటర్లు, సిబ్బంది తమ విధులను బాధ్యతగా నిర్వహించాలని సూచించారు. పరీక్షల పారదర్శకతను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఈ తనిఖీలలో భాగంగా కలెక్టర్ విద్యార్థుల హాజరు శాతాన్ని అడిగి తెలుసుకున్నారు. సింగరేణి కాలరీస్ హై స్కూల్ సహా అన్ని పరీక్షా కేంద్రాల్లో 100 శాతం హాజరు నమోదైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ తనిఖీలు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.




