1 April, 2026 | 2:34 AM

హోర్ముజ్‌లో టోల్ వసూలు

01-04-2026 12:49 AM
  1. ఇరాన్ పార్లమెంట్ భద్రతా కమిటీ ఆమోదం
  2. ఒక్కో చమురు ట్యాంకర్‌పై గరిష్టంగా రూ. 18.90 కోట్లు
  3. నిబంధనలు పాటించి 26 నౌకలు దాటాయన్న ఐఆర్జీసీ
  4. ప్రపంచదేశాలు అంగీకరించబోవన్న అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో

ఇరాన్, మార్చి 31: హోర్ముజ్‌లో టోల్ వసూలుకు ఇరాన్ పార్లమెంట్ భద్రతా కమిటీ ఆమోదముద్ర వేసింది. దీంతో అధికారికంగా ఇక ఇరాన్ ఆ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై టోల్ వసూలు చేయనుంది. ఈ మేరకు హోర్ముజ్ మేనేజ్‌మెంట్ ప్లాన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో చమురు ట్యాంకర్‌పై గరిష్టంగా రూ. 18.90 కోట్లు వసూలు చేయనున్నారు. ఆ దేశ అధికారిక మీడియా ఐఆర్‌ఐబీ ఈ విషయాన్ని వెల్లడించింది.

హోర్ముజ్‌పై ఇరాన్ తన సార్వభౌమాధికారాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ఐఆర్‌ఐబీ తెలిపింది. ఇందులో జలమార్గాన్ని పరిరక్షించే భద్రతా ఏర్పాట్లు సముద్రయాన భద్రతను నిర్దరించే చర్యలు, ఆర్థిక నిబంధనలు, అమెరికా, ఇజ్రాయెల్‌లకు చెందిన నౌకల రాకపోకలపై నిషేధం వంటివి ఉన్నాయని పేర్కొంది. ఐఆర్జీసీ నిర్దేశించిన టోల్ సిస్టమ్ నిబంధనలు పూర్తిచేసి ఇప్పటివరకు 26 నౌకలు హోర్ముజ్‌ను దాటినట్లు పేర్కొంది.

ఇందుకోసం ఆయా నౌకలు సంబంధిత పత్రాలు సమర్పించి క్లియరెన్స్ కోడ్‌లు పొందినట్లు తెలిపింది. కాగా ఇరాన్ హోర్ముజ్‌పై తీసుకున్న నిర్ణయంపై అమెరికా మండిపడుతుంది. తీవ్రంగా ఖండిస్తూ ఈ జలసంధిపై టెహ్రాన్ నియంత్రణను ప్రపంచదేశాలు అంగీకరించబోవని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అన్నారు. ఇతర దేశాలనే కాకుండా అంతర్జాతీయ జలమార్గాలను కూడా స్వాధీనం చేసుకొని, తమవిగా చెప్పుకోవచ్చనే కొత్త విధానం అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.