24 April, 2026 | 3:08 AM

మల్లాపూర్ ప్రజల కష్టాలు తీరేదెప్పుడు?

24-04-2026 12:00 AM
  1. రాజపత్రం విడుదలైన.. పాత మండలంలోనే సర్కార్ పనులు
  2. రెవిన్యూ పనులు ఇంద్రవెల్లిలో.. మిగతా శాఖల పనులు సిరికొండలో..

ఉట్నూర్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలకు  నేటికీ మల్లాపూర్ పంచాయతీ ప్రజలు కష్టాలను అనుభవిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని మల్లాపూర్, ధర్మసాగర్ గ్రామాలను ఇంద్రవెల్లి మండలం నుండి విడదీసి 2017 లో సిరికొండ మండలంలో విలీనం చేశారు. తమ గ్రామాల నుండి సిరికొండ మండల కేంద్రానికి దూర భారంతో పాటు వాగులు దాటి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని రెండు గ్రామాల ప్రజలు  ఆందోళన చేపట్టారు.

రెండు గ్రామాల ప్రజల ఆందోళన గుర్తించిన అప్పటి జిల్లా కలెక్టర్ బుద్ధ ప్రకాష్ వాస్తవ పరిస్థితులను పరిశీలించి  ప్రభుత్వానికి లేఖలు పంపించారు. లేఖలు పంపించిన కలెక్టర్ బుద్ధ ప్రకాష్ బదిలీ కావడంతో ఆయన స్థానంలో విధుల్లో చేరిన అప్పటి జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ మరోసారి ప్రభుత్వానికి లేఖలు పంపించారు. దివ్య దేవరాజన్ పంపిన లేఖతో సిరికొండ మండలంలో విలీనం చేసిన రెండు గ్రామాలను తిరిగి పాత మండలంలోకి  కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పాటు రాజపత్రాన్ని  విడుదల చేసింది. 

రాష్ట్ర ప్రభుత్వ విడుదల చేసిన రాజపత్రంతో మల్లాపూర్, ధర్మసాగర్ గ్రామాల్లోని రైతులతో పాటు రెవిన్యూ సమస్యలను ఇంద్రవెల్లి మండల కేంద్రంగా  పరిష్కరించుటకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుం డి నేటి వరకు రెవెన్యూ పనులు ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని జరుగుతున్నాయి. పంచాయతీరాజ్‌తో పాటు వ్యవసాయ, విద్య, ఐసిడిఎస్  తదితర శాఖలో పనులు సిరికొండ మండలంలోని కొనసాగుతున్నాయి. ఈ విషయాన్ని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ద్వారా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో మంత్రి సీతక్క స్పందించి మల్లాపూర్, ధర్మసాగర్ గ్రామాలను ఇంద్రవెల్లి మండలంలోని కొనసాగే విధంగా రాజపత్రాన్ని 15 ఏప్రిల్ 2025 లో విడుదల చేశారు.

ప్రభుత్వం విడుదల చేసిన రాజ పత్రాన్ని చూసి రెండు గ్రామాల గిరిజనులు సంతోషపడ్డారు. కానీ వారి సంతోషం నేటికి నెరవేరలేదు. రాజ్య పత్రం వచ్చి ఏడాది పూర్తయిన నేటికీ పంచాయతీ రాజ్, విద్యా వ్యవసాయ తదితర శాఖల పనులు సిరికొండ మండలం నుంచి చేయించుకోవలసి వస్తుంద ని మల్లాపూర్ గ్రామ పటేల్  దుర్వ రాజు, మాజీ సర్పంచు పూసం ఆనందరావు వాపోయారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో  రోజువారీగా పని చేస్తున్న కూలీలకు  సిరికొం డ మండలంలోనే మాస్టర్ ఇవ్వాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. జనన, మరణ దృవపత్రాలను సైతం సిరికొండ మండలంలోనే తీసుకోవలసి వస్తుందని  రెండు గ్రామా ల ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులతో పాటు  రాష్ట్ర అధికారులు మల్లాపూర్, ధర్మసాగర్ గ్రామాలను ఇంద్రవెల్లి మండలంలోనే పంచాయతీరాజ్ ఇతర శాఖల పనులు జరిగే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలని గిరిజనులు కోరుతున్నారు.