క్రీడాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
ఒలింపిక్స్ లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటేలా ప్రణాళికలు
హైదరాబాద్: తెలంగాణ క్రీడాశాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సోమవారం నాడు సమీక్ష నిర్వహించారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీలో(Young India Sports University) సౌకర్యాల కల్పనపై చర్చించారు. ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు అన్ని సౌకర్యాలతో స్పోర్ట్స్ వర్సిటీల నిర్మాణాలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. గచ్చిబౌలి ఔట్ డోర్ స్టేడియం(Gachibowli Outdoor Stadium) పునరుద్ధరణతో పాటు ఇండోర్ స్టేడియం, యూనివర్సిటీ కాంప్లెక్స్, హాస్టల్ భవనాలు, అన్ని రకాల క్రీడా మైదానాలు, శిక్షణకు అవసరమైన ఇతర సౌకర్యాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వర్సిటీ నిర్మాణాలకు సంబంధించి పలు డిజైన్లను పరిశీలించిన రేవంత్ రెడ్డి అందుకు సంబంధించి అధికారులకు కీలక సూచనలు చేశారు. ఒలింపిక్స్, కామన్ వెల్త్ క్రీడలకు తెలంగాణ ఆతిథ్యం ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఒలింపిక్స్ లో తెలంగాణ క్రీడాకారులు(Telangana players) సత్తా చాటేలా పణాళికలు రూపొందించాలని సూచించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం(Shri Kotla Vijaya Bhaskar Reddy Stadium), ఎల్బీ స్టేడియం, సరూర్ నగర్ స్టేడియాలను ఆధునీకరించాలని ఆదేశించారు. భవిష్యత్ అవసరాలు, శిక్షణ, పోటీలకు అనుగుణంగా ఆధునీకరించాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivasa Reddy), సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎస్ఏటీ చైర్మన్ శివసేనా రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.




