వ్యవసాయ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష.. సన్నవడ్ల రైతులకు సర్కార్ గుడ్‌న్యూస్
హైదరాబాద్: ఎంసీహెచ్‌ఆర్‌డీలో వ్యవసాయశాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) సమీక్ష నిర్వహించారు. బోనస్ ఇచ్చే 7 రకాల సన్నవడ్ల విత్తనాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఏడు రకాల సన్నవడ్ల విత్తనాలను సబ్సిడీపై ఇవ్వాలని సూచించారు. రైతు వేదికల్లో విత్తనాలు అందుబాటులో ఉంచాలన్నారు. సన్న వడ్లు పండించే రైతుల వివరాలు సేకరించాలన్న రేవంత్ రెడ్డి వ్యవసాయశాఖలో(Department of Agriculture) సాంకేతికతను మరింత పెంచుకోవాలని తెలిపారు.
ధాన్యం దిగుబడిపైన వ్యవసాయ శాఖకు సంపూర్ణ అవగాహన ఉండాలని పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడం(Bhadradri Kothagudem) దమ్మపేట మండలంలో ప్రారంభించి పైలెట్ ప్రాజెక్ట్ ను మరింత వినియోగించుకోవాలన్నారు.వ్యవసాయంలో ఏఏఐని మరింతగా వినియోగించాలని చెప్పారు. సాంకేతికతలో అగ్రికల్చర్ వర్సిటీని నోడల్ ఏజెన్సీగా పెట్టుకోవాలన్నారు. విత్తన వడ్ల కొనుగోళ్లలో అగ్రికల్చర్ వర్సిటీతో సమన్వయం చేసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.
అన్ని ఎరువులకు యాప్ పెట్టాలన్నారు. యాప్ లో బుక్ చేసుకునే యూరియాను రైతు వేదికల్లో పంపిణీ చేయాలని రేవంత్ రెడ్డి( Revanth Reddy) పేర్కొన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ కు యూరియా పంపిణీ బాధ్యత అప్పగించాలని తెలిపారు. యూరియా, ఎరువుల కేటాయింపులపూ తరచూ కేంద్రానికి లేఖలు రాయాలని సూచించారు. రామగుండం ఎరువులు మొత్తం తెలంగాణ రాష్ట్రానికే ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని ఆదేశించారు. ఎరువుల పరిస్థితిపై అన్ని పార్టీల ఎంపీల(Telangana MPs) సమావేశం నిర్వహించి పరిస్థితిని వివరించాలని వ్యవసాయ శాఖ సమీక్షలో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, శ్రీధర్ బాబు(Minister Sridhar Babu), రాజ్య సభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సిఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి , వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, ప్రణాళిక శాఖ కార్యదర్ గౌరవ్ ఉప్పల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






