31 May, 2026 | 2:01 PM

ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ అమలుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

31-05-2026 12:33 PM

హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి ప్రభుత్వం అమల్లోకి తీసుకువస్తున్న ఎంప్లాయీస్​ హెల్త్ స్కీమ్​ అమలుపై ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఎంప్లాయి హెల్త్ కేర్​ ట్రస్ట్ ద్వారా ఈ పథకం అమలు కానుంది. ఈ పథకానికి సంబంధించి ఉద్యోగ సంఘాల నుంచి ఆరుగురు, పెన్షనర్ల నుంచి ఇద్దరు ప్రతినిధులు ఈ ట్రస్ట్ సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఒకరిని ఈ ట్రస్టుకు సీఈవోగా నియమిస్తారు.

ఈ పథకం అమలుకు అవసరమైన వివరాల సేకరణ ఇప్పటికే ప్రారంభమైంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల వివరాలను సేకరించేందుకు ఫైనాన్స్ శాఖ ఇప్పటికే అన్ని శాఖలకు సర్క్యులర్​ జారీ చేసినట్లు సమాచారం. మే 31వ తేదీలోపు డేటా అప్‌లోడ్‌ చేయాలని స్పష్టం చేసింది. ఈ వివరాల ఆధారంగా డిజిటల్ హెల్త్ కార్డులు, క్యాష్‌లెస్ చికిత్స సేవలు అందించేలా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని అధికారులు వెల్లడించారు. ఇవాళ సాయంత్రం లోపు డేటా అప్ లోడ్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు సమాచారం.