మూసీ ప్రక్షాళన ఆగదు
పేదలకు అన్యాయం జరగదు
నష్టపోయిన వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు, పరిహారం
కూకట్‌పల్లి నల్లచెరువు ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 9 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరాన్ని మరింత సుందరంగా, పర్యావరణహితంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నా రు. నగరంలోని రోడ్ల విస్తరణ, ఆక్రమణల తొలగింపు, చెరువులు, మూసీ నది పునరుద్ధరణ వంటి బృహత్తర కార్యక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదని తేల్చిచెప్పారు. కూకట్‌పల్లిలో హైడ్రా ఆధ్వర్యంలో సరికొత్త రూపురేఖలు సంతరించుకున్న నల్ల చెరువును సోమవారం ఆయన అట్టహాసంగా ప్రారంభించారు.
ప్రారంభోత్సవం అనంతరం చెరువు వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులతో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. అక్రమ నిర్మాణాలు హైడ్రా కూల్చివేస్తున్నప్పుడు తనపై అనేక విమర్శలు వచ్చాయని, ఈ నిర్ణయాల వెనుక తనకు ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశారు.
నల్ల చెరువును చూసి ఇక్కడి వేలాది మంది ప్రజల ముఖాల్లో కనిపిస్తున్న ఆనందమే తనకు అత్యంత సంతోషాన్నిచ్చింది అని సీఎం అన్నారు. నిరాశ్రయులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లను సిద్ధం చేశామని, పరిహారం ఇచ్చి ఆదుకుంటాం అని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ఇకపై పునరుద్ధరించిన చెరువులు, పార్కుల చుట్టూ క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తామన్నారు. మహిళలు, యువతకు ఉపాధి కల్పించేలా చెరువుల వద్ద వ్యాపార కేంద్రాలు, ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కూకట్‌పల్లి ప్రాంతంలోని చెరువులన్నింటినీ ఇదే తరహాలో పునరుద్ధరిస్తామని చెప్పారు.




