ప్రభుత్వ బడుల మూసివేత తగదు
- ప్రైవేటు పాఠశాలలను నియంత్రించాలి
- ప్రభుత్వ బడులను అభివృద్ధి చేయాలి
- ముఖ్యమంత్రికి విద్యావేత్తలు, మేధావుల లేఖ
హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): రాష్ట్రంలోని 27 వేల ప్రభుత్వ పాఠశాలలను నాలుగు వేలకు కుదిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడాన్ని రాష్ట్రంలోని విద్యావేత్తలు, మేధావులు, కవులు, ప్రజాసంఘాల నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. తక్షణమే ఆ ప్రకటనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వంద మందికి పైగా వివిధ రంగాలకు చెందిన మేధావులు సీఎంకు మంగళవారం బహిరంగ లేఖను రాశారు.
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీడియా సమావేశాన్ని నిర్వహించి బహిరంగ లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతంలో 23 వేల బడుల మూసివేతను ఉపసంహరించుకోవాలని, విద్యా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణను నియంత్రించాలని, అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రవేశపెట్టాలని, మౌలిక వసతులు కల్పిస్తూ, సరిపడా టీచర్లను నియమించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో విద్యారంగం సంక్షోభంలో ఉందని అలాగే రాజకీయాలలో విద్య లేదని కానీ విద్యలో రాజకీయాలు ఎక్కువైపోయాయని ఆ కారణంగానే సామాజిక అవసరాలు గుర్తించకుండా పాఠశాలల మూసివేత ప్రకటన చేశారని దుయ్యబట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతున్నదనే నెపంతో పాఠశాలల మూసివేత నిర్ణయాలు గైకొనడం సరికాదన్నారు. విద్యార్థుల సంఖ్య తగ్గడానికి కారణాలేంటో శాస్త్రీయంగా అధ్యయనం చేశారా అని ప్రశ్నించారు.
విద్యకు 15% నిధులు కేటాయిస్తామని గత ప్రభుత్వ మూసివేసిన 6000 పాఠశాలలను తెరిపిస్తామని తమ మేనిఫెస్టో ద్వారా హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక బడ్జెట్ కేవలం 8.2% మాత్రమే కేటాయించి, ఏకంగా 23 వేల పాఠశాలలను మూసివేస్తామని ప్రకటించడం ప్రజలను ప్రజలను వచించడమే అన్నారు. గత ప్రభుత్వము లాగానే నేటి ప్రభుత్వం కూడా ప్రజాస్వామికంగా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు.
పాఠశాలల పరిరక్షణ మరియు బలోపేతం కోసం ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. బడికి గ్రామ ప్రజలకు ఉండే మానవీయ అనుబంధాన్ని తుంచి వేయడం తగదని తక్షణమే ఆ ప్రకటనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందినదని అలాగే ఎక్కువ బడ్జెట్ కలిగి ఉందని అయినప్పటికీ విద్యారంగానికి అతి తక్కువ నిధులు కేటాయిస్తున్నారని కేజీ నుండి పీజీ వరకు ప్రభుత్వ విద్యను విధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. ప్రైవేటు పాఠశాలలను అదుపు చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని జీవో ఎంఎస్ నెంబర్ వన్, విద్యా హక్కు 1982 నిబంధనల ప్రకారం నియంత్రించలేకపోతున్నదని విమర్శించారు.
ఈ మీడియా సమావేశంలో ప్రముఖ పాత్రికేయుడు, సంపాదకుడు కే రామచంద్రమూర్తి, నాక్ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ విఎస్ ప్రసాద్, జస్టిస్ చంద్రకుమార్, ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ డి నరసింహారెడ్డి, కేంద్ర సమాచార కమిషన్ మాజీ కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్, హైకోర్టు సీనియర్ అడ్వకేట్ చిక్కుడు ప్రభాకర్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి నందిని సిధారెడ్డి, ప్రొఫెసర్ జి హరగోపాల్, ప్రొఫెసర్ కే చక్రధర్‌రావు, ప్రొఫెసర్ కే లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.






