మిషన్ భగీరథ ద్వారా ప్రతి గ్రామానికి శుద్ధ జలం అందించాలి
కలెక్టర్ కె హరిత
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని ప్రతి గ్రామానికి మిషన్ భగీరథ ద్వారా నిరంతర తాగునీటి సరఫరా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె హరిత ఆదేశించారు. గురువారం కెరమెరి మండలం ధనోరా గ్రామంలోని మిషన్ భగీరథ పంప్ హౌస్‌ను సందర్శించి పంపింగ్ వ్యవస్థ, పైప్‌లైన్లు, నీటి సరఫరాపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
లీకేజీలు, మోటార్ సమస్యలను వెంటనే మరమ్మతు చేసి గ్రామాలకు తాగునీరు నిరంతరం అందేలా పర్యవేక్షించాలని సూచించారు.అనంతరం కొఠారి కోలం గూడ గ్రామంలో గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ టి ఎన్ ప్రకాష్ రావు తో కలిసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. గ్రామానికి 110 ఇండ్లు మంజూరు కాగా 108 ఇండ్ల పనులు ప్రారంభమయ్యాయని, 7 ఇండ్లు పూర్తయ్యాయని తెలిపారు. మిగతా ఇండ్లు వివిధ దశల్లో ఉండగా, 86 ఇండ్లు స్లాబ్ దశకు చేరుకున్నాయని పేర్కొన్నారు. లబ్ధిదారులు నాణ్యతతో ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని, అధికారులు ప్రతిరోజూ పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.






