21 March, 2026 | 10:54 PM

పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించాలని సిఐటియు ఆధ్వర్యంలో ప్రదర్శన

21-03-2026 05:21 PM

దమ్మపేట,(విజయక్రాంతి): కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వంటగ్యాస్ ధరలను పెంచి ఇప్పుడు మరలా ప్రీమియం పెట్రోల్ ధరలను పెంచి దేశ ప్రజలపై మోయలేని ఆర్థిక భారాలు మోపుతుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ అన్నారు. శనివారం పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించాలని సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పిట్టల అర్జున్ మాట్లాడుతూ... ఇరాన్ పైఅమెరికా ఇజ్రాయిల్ సాగిస్తున్న యుద్ధంలో దేశంలోని కార్పొరేట్ శక్తులు మాత్రమే లాభాలు దండుకుంటున్నారు.

ఇప్పటికే వంట గ్యాస్ కమర్షియల్ గ్యాస్ ధరలను పెంచడం వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఈ క్రమంలో పెట్రోల్ ధరలు పెంచడం అంటే నిత్యవసర వస్తువుల ధరలు కూడా పెరిగి సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు. అనంతరం సిఐటియు మండల కన్వీనర్ మురహరి రఘు మాట్లాడుతూ వంటగ్యాస్ ధరల పెంపు తర్వాత పెట్రోల్ వంతు వచ్చిందని తర్వాత డీజిల్ రేట్లు కూడా పెంచుతారని మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను దేశ ప్రజలందరూ తిప్పి కొట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కోడూరి కృష్ణ, రామకృష్ణ, కోటేశ్వరరావు, కొర్రాజులు, విజయలక్ష్మి, యశోద, ధర్మ, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.