6 June, 2026 | 5:22 PM

చిరుమర్తి లింగయ్య క్షమాపణ చెప్పాలి

06-06-2026 03:53 PM

తెలంగాణ ఉద్యమకారుల వేదిక జిల్లా అధ్యక్షుడు పల్లపు బుద్ధుడు

చిట్యాల,(విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారులు, కళాకారులు మరియు రాష్ట్ర ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంపై మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ఉద్యమకారుల వేదిక జిల్లా అధ్యక్షుడు పల్లపు బుద్ధుడు శనివారం తీవ్రంగా ఖండిస్తూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పల్లపు బుద్ధుడు  మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలియకుండా ఉద్యమకారులు, కళాకారులు, ప్రజా నాయకులపై అవమానకర వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు.

వేముల వీరేశం తెలంగాణ ఉద్యమ కాలంలో అనేక పోరాటాల్లో పాల్గొని ఉద్యమకారులకు అండగా నిలిచారని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల మన్ననలు పొందిన నాయకుడని పేర్కొన్నారు. ప్రజల మధ్య ఉంటూ పార్టీ పట్ల, నాయకత్వం పట్ల నిబద్ధతతో పనిచేస్తున్నందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు ప్రభుత్వ విప్ బాధ్యతలు అప్పగించారని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై కేసులు, అరెస్టులు, లాఠీచార్జీలు జరిగిన సందర్భాల్లో వేముల వీరేశం ఉద్యమకారులకు అండగా నిలిచారని,

అలాంటి నాయకుడిపై విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. తెలంగాణ ఉద్యమంలో నకిరేకల్ ప్రాంతానికి ప్రత్యేక స్థానం ఉందని, ఈ ప్రాంత ప్రజల ఉద్యమ స్ఫూర్తిని తక్కువ చేసి మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమకారులు, కళాకారుల పట్ల చిరుమర్తి లింగయ్య చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తెలంగాణ ఉద్యమకారులు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.