గద్దర్ అవార్డుల నగదును విరాళం ఇచ్చిన చిరంజీవి
టాలీవుడ్ అగ్ర నటుడు చిరంజీవి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక తెలంగాణ గద్దర్ సినీ పురస్కారాల్లో ‘ఎన్టీఆర్ జాతీయ పురస్కారం’ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ అవార్డు కింద తనకు ప్రభుత్వం అందించిన రూ.10 లక్షల నగదును మెగాస్టార్ ఐదు స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చారు. చిరంజీవి తన కుమారుడు, నటుడు రామ్‌చరణ్ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం ఈ మొత్తాన్ని ఆయా సంస్థల బాధ్యులకు అప్పగించారు.
‘సర్వ్ ఫౌండేషన్’కు చెందిన వృద్ధుల కోరిక మేరకు వారి సమక్షంలో రామ్‌చరణ్ పుట్టినరోజును జరిపారు. మొత్తం 30 మంది వృద్ధులను చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌కు ఆహ్వానించారు. వారికి కొత్త బట్టలు అందజేసి, ప్రత్యేక విందు ఏర్పాటుచేశారు. ఇదే కార్యక్రమంలో ఆ సంస్థ బాధ్యులకు విరాళాన్ని అందజేశారు. ‘దేవనార్ ఫౌండేషన్ ఫర్ ది బ్లైండ్’కు, ‘వాల్మీకి ఫౌండేషన్’కు, ‘నయశ్రీ ఫౌండేషన్’కు సైతం ఆర్థిక సహాయం అందించారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న ఓ చిన్నారి చికిత్స కోసం బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి సైతం ‘గద్దర్ అవార్డు’ నగుదులో నుంచి కొంత విరాళంగా అందించారు.




