24 June, 2026 | 2:31 AM

వియాస్ ఫార్మా కంపెనీలో రసాయనాలు లీక్

24-06-2026 12:28 AM

రసాయనాల వాసనకు విద్యార్థులకు, రైతులకు అస్వస్థత

చిట్యాల, జూన్ 23 : మండలంలోని పేరపల్లి గ్రామ పరిధిలో గల ’వియాస్ ఫార్మా’ కంపెనీలో మంగళవారం ప్రమాదవశాత్తు రసాయన వాయువు (కెమికల్) లీకైంది. ఈ రసాయన ఘాటుకు పేరపల్లి నుండి వెలిమినేడు గ్రామానికి వెళ్ళే మార్గంలో ప్రయాణిస్తున్న పలువురు పాఠశాల విద్యార్థులు, పొలాల్లో పనిచేసుకుంటున్న రైతులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రసాయన వాయువు గాల్లో కలవడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన వాసన వ్యాపించింది.

దీంతో మార్గమధ్యంలో ఉన్నవారికి ఒక్కసారిగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. కళ్ళు మండటం, వాంతులు, తలతిరగడం వంటి లక్షణాలతో పలువురు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అస్వస్థతకు గురైన వారిని స్థానికులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు.

ఫార్మా కంపెనీల నుండి వెలువడే కాలుష్యం మరియు రసాయనాల పట్ల యాజమాన్యం సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం విద్యార్థులు, రైతులు తిరిగే ఈ మార్గంలో ఇలాంటి ఘటన జరగడం పట్ల ప్రజలు ఆందోళన చెందుతూ, అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.