రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకే విస్తృతంగా తనిఖీలు
ఎంవీఐ ప్రదీప్ కుమార్ గౌడ్
బాన్సువాడ,(విజయక్రాంతి): రహదారి భద్రతను మెరుగుపరచడం, ప్రమాదాల నివారణే లక్ష్యంగా రవాణా, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో విస్తృతంగా వాహనాలను తనిఖీలు చేపడుతున్నామని, వాహనదారులు పూర్తిస్థాయిలో సహకరించాలని కామారెడ్డి మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ) ప్రదీప్ కుమార్ గౌడ్ అన్నారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలోని ఆర్టీవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాహన తనిఖీలు ప్రజలను ఇబ్బందులకు గురిచేయడానికి కాదని, ప్రతి పౌరుడి ప్రాణాలను రక్షించడమే ప్రధాన ఉద్దేశమని ఎంవీఐ తెలిపారు.
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలను అరికట్టేందుకు తనిఖీలు కీలకమన్నారు.వాహనాలు నడిపేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, ఇన్సూరెన్స్, పీయూసీ తదితర చెల్లుబాటు అయ్యే వాహన పత్రాలను ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవాలని సూచించారు. ఓవర్‌లోడింగ్, రాంగ్‌సైడ్ డ్రైవింగ్, అతివేగం వంటి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల సమయంలో అధికారులు అడిగిన పత్రాలను చూపించి అధికారులకు సహకరించాలని ప్రదీప్ గౌడ్ కోరారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుతంగా వాహనాలు నడిపి సురక్షిత ప్రయాణం సాగించాలని ఆయన సూచించారు.






