16 May, 2026 | 11:26 PM

చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు

16-05-2026 10:03 PM

కరీంనగర్ క్రైమ్,(విజయక్రాంతి): రానున్న బక్రీద్ పండుగను పురస్కరించుకుని కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. శనివారం నాడు కమిషనరేట్ కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాలులో విశ్వ హిందూ పరిషద్  బజరంగ్ దళ్, గోరక్ష ప్రముఖ్ తదితర హిందూ మత సంఘాల ప్రతినిధులతో కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఒక ముఖ్యమైన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ, పండుగ వేళ ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదని స్పష్టం చేశారు. పశువుల అక్రమ రవాణా లేదా గోవధకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా, తక్షణమే పోలీసులకు తెలియజేయాలే తప్ప చట్టాన్ని ఉల్లంఘించకూడదని హెచ్చరించారు. అలా కాదని చట్టాన్ని అతిక్రమిస్తే తెలంగాణ గోవధ నిషేధ మరియు జంతు సంరక్షణ చట్టం, 1977 ప్రకారం కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు.

గోవుల అక్రమ రవాణాపై పూర్తి నిషేధం చేపట్టి నిఘా రాష్ట్రంలో గోవుల అక్రమ రవాణాను పూర్తిగా నిషేధించినట్లు సీపీ తెలిపారు. పశువుల రవాణాకు సంబంధించి నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. రవాణా చేసే పశువులకు సంబంధించి వెటర్నరీ డాక్టర్లు జారీచేసే ఫిట్ ఫర్ ట్రాన్స్‌పోర్ట్’ పత్రాలు తప్పనిసరిగా తనిఖీ చేస్తారు.

6 వ్యూహాత్మక ప్రాంతాలలో చెక్‌పోస్టులు

పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా 121 చెక్‌పోస్టులు, 52 అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు పనిచేస్తున్నాయని.. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేకంగా 6 చోట్ల చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు సీపీ వెల్లడించారు.

ఈ చెక్‌పోస్టుల వద్ద శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా సరిపడా పోలీసు సిబ్బందిని కేటాయించామని, రానున్న రెండు వారాల పాటు నిరంతరం మరింత పటిష్ట భద్రతను కొనసాగిస్తామని సీపీ తెలిపారు. చెక్‌పోస్టుల వద్ద అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారని చెప్పారు.

చట్టాన్ని ఉల్లంఘించి పశువుల అక్రమ రవాణాకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు, రవాణాకు ఉపయోగించిన వాహనాలను కూడా సీజ్ చేస్తామని సీపీ హెచ్చరించారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల ప్రథమ ప్రాధాన్యతని, అందరూ పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం కోరారు.