25 August, 2026 | 4:43 AM

వైకుంఠరథం ఉన్నా లేనట్టే!?

25-08-2026 01:04 AM
  1. రూ. 15 లక్షల విలువైన  రథం
  2. షెడ్డుకే పరిమితం 
  3. గడికోట ట్రస్టు విరాళం వృథా 
  4. రిపేర్లకు ఇచ్చిన రూ.2 లక్షలు స్వాహా 
  5. అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని లాగా..

దోమకొండ, ఆగస్ట్ 24 (విజయక్రాంతి): గత రెండేళ్లుగా 15 లక్షల రూపాయల విలువచేసే వైకుంఠ రథం దోమకొండ మండల కేంద్రంలో వృధాగా పడి ఉంది. దోమకొండ వాసుల అంతిమయాత్రకు, అంతిమ దహన సంస్కారాలకు ఉపయోగపడే వైకుంఠ రథం షెడ్డుకి పరిమితమైంది.

దోమకొండ గ్రామపంచాయతీ భవనం ఆవరణలో 2 సంవత్సరాలుగా వైకుంఠ రథం ఎవరికి ఉపయోగపడకుండా వృధాగా పడి ఉంది జిల్లాలో అతిపెద్ద గ్రామపంచాయతీ సుమారు 20వేల జనాభా గల దోమకొండలో అంతిమ యాత్రకు మండల కేంద్ర వాసులకు కష్టాలు ఎదురవుతున్నాయి. ప్రైవేటుగా ఏర్పాటుచేసిన రెడ్డి సంఘం వైకుంఠ రథానికి అంతిమ సంస్కారాలకు వాడుకుంటే  2, 3 వేల రూపాయలు ఖర్చు అవుతుంది.

అంతిమయాత్రకు ప్రజలకు, పేదలకు కార్మికులకు ఉపయోగపడుతుందని దోమకొండ గడి ట్రస్ట్ ఆధ్వర్యంలో 15 లక్షల రూపాయలు ఖర్చు చేసి విరాళంగా వైకుంఠ  రథాన్ని  నాలుగు సంవత్సరాల క్రితం అందజేశారు. నిర్వహణ, రిపేర్లు చేసేవారు లేక లక్షల రూపాయల విలువచేసే అత్యంత ముఖ్యమైన కార్యానికి అంతిమయాత్రలకు ఉపయోగించే వైకుంఠ రథం వృధాగా పడి ఉంది. రథం ఉన్నా ప్రజలకు ఉపయోగం లేదు. నిర్వహణ రిపేర్లు చేయాల్సిన గ్రామపంచాయతీ చేతులెత్తేసింది.

ఇటీవల ప్రజలకు దోమకొండ గడికోట ట్రస్ట్ యాజమాన్యం రెండు లక్షల రూపాయలు పంచాయతీ పాలకవర్గానికి సర్పంచ్ కి అందజేసిన సరైన రిపేర్లు చేపట్టక పోవడంతో షెడ్డు కి పరిమితమైంది. గడి ట్రస్ట్ యాజమాన్యం రిపేర్ కోసం ఇచ్చిన రెండు లక్షల రూపాయలు స్వాహా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో అతిపెద్ద గ్రామపంచాయతీ, పాత తాలూకా కేంద్రమైన దోమకొండలో నెలకు 20 మంది వరకు వివిధ కారణాలతో అనారోగ్యంతో వృద్ధాప్యంతో మృత్యువాత పడుతున్నారు.

అత్యధికంగా దోమకొండలో కార్మికులు రైతులు పేదవారు బీడీ కార్మికులు నివసిస్తున్నారు. వారికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో గడి ట్రస్ట్ విరాళంగా వైకుంఠ రథాన్ని అందజేస్తే ప్రజలకు పేదలకు బాధితులకు ఉపయోగపడడం లేదు. షెడ్డుకే పరిమితమై దోమకొండ వాసులను,ప్రజాప్రతినిధులను, గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని వెక్కిరిస్తుంది. పాలకులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు వ్యక్తిగత ప్రచారానికి అలవాటు పడి పేదలకు కార్మికులకు అంతిమయాత్రలకు ఉపయోగపడే వైకుంఠ రథంని పట్టించుకోవడంలేదని రిపేర్లకి ఇచ్చిన సొమ్మును కూడా మింగేసారని విమర్శలు వస్తున్నాయి.

పేదలకు బడుగులకు ఉపయోగపడే  రథం నిర్వహణ భారం చూడాల్సిన పట్టింపు లేని రీతిలో దోమకొండ పంచాయతీ ఆఫీసు వ్యవహరిస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. గత పాలక వర్గము లాగానే నూతన పంచాయతీ పాలకవర్గం అత్యంత ప్రధానమైన ప్రజలకు ఉపయోగపడే వైకుంఠ రథం సద్వినియోగం చేసుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. పేదలు కార్మికులు బడుగులు అంతిమ యాత్రకు అష్టకష్టాలు పడుతున్నారని లక్షలు మంజూరు చేసిన నిర్వహణ శూన్యం అని విమర్శలు వస్తున్నాయి.నిర్వహణ రిపేర్లు కోసం గడికోట ట్రస్టు ఇచ్చిన నిధులు మాయం చేశారని ఆరోపణలు ఉన్నాయి.

అందరికీ ఉపయోగపడే వైకుంఠ రథం ఎవరికి పట్టింపు లేని రథంలాగా వృధాగా పోతుంది. 20 వేల జనాభాకు అందని ద్రాక్షలా అతి ముఖ్యమైన సమస్య ప్రజలకు అంతిమ సేవ కు సంబంధించి రథం నిర్వహించాల్సిన దోమకొండ గ్రామపంచాయతీ అలసత్వం చూపుతుంది. రథం విరాళంగా అందించామని గడి ట్రస్ట్ చెబుతుంది.అంతిమ యాత్రకు అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని లాగా దాపురించింది. రథం ఉన్నా ప్రజలకు ఉపయోగం లేదు. నిర్వహించాల్సిన గ్రామపంచాయతీ ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకుని రిపేర్ చేసి బడుగుల పేదల అంతిమయాత్రకు తగు చర్యలు తీసుకోవాలని  పాత తాలూకా కేంద్రం వాసులు కోరుతున్నాం.