17 March, 2026 | 5:13 PM

దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో అస్తవ్యస్త వైద్య సేవలు: బీసీ సంక్షేమ సంఘం ఆగ్రహం

17-03-2026 03:40 PM

దేవరకొండ,(విజయ క్రాంతి): దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి పేద ప్రజల పాలిట శాపంగా మారిందని విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బందిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన తన బృందంతో కలిసి ఆసుపత్రిని సందర్శించి అక్కడ నెలకొన్న దారుణ పరిస్థితులను స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది కనీస సమయపాలన పాటించడం లేదని మండిపడ్డారు. రోగుల సంఖ్యకు అనుగుణంగా డాక్టర్లు ఉన్నప్పటికీ వారు సీట్లలో అందుబాటులో ఉండకపోవడం వల్ల గంటల తరబడి పేదలు నిరీక్షించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సూపరింటెండెంట్ డాక్టర్ రవి ప్రకాష్‌తో సహా పలువురు సిబ్బంది రోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని కనీసం డ్రెస్ కోడ్ కూడా పాటించడం లేదని విమర్శించారు.

ఆసుపత్రిలో కనీస మౌలిక సదుపాయాలైన తాగునీరు కూడా ఎండాకాలంలో అందుబాటులో లేకపోవడం శోచనీయమన్నారు. ల్యాబ్ టెక్నీషియన్లు, ఎక్స్‌రే విభాగం వారు రోగులతో మర్యాద లేకుండా మాట్లాడుతూ.. పరీక్షలు లేవని బయట ప్రైవేట్ సెంటర్లకు వెళ్లాలని ఉచిత సలహాలు ఇస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. డెలివరీ సెక్షన్లు, ఎమర్జెన్సీ వార్డుల్లో నర్సులు, ఆయాలు బహిరంగంగానే డబ్బులు వసూలు చేస్తున్నారని థైరాయిడ్ వంటి కీలక పరీక్షలు చేయడం లేదని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.

ఈఎన్ టి  డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో రోగులు నరకయాతన అనుభవిస్తున్నారని, ఆసుపత్రి ఒక మాయా లోకం లా తయారైందని ఆయన ఎద్దేవా చేశారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి విచారణ జరిపించాలని పేద ప్రజలకు న్యాయం జరగని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి కోటేశ్వరరావు, పున్న వెంకటేష్, పున్న బిక్షమయ్య, భీమగోని శివగౌడ్, పెరికేటి శ్రీనివాసాచారి, చిన్నగోని శ్రీనివాస్ గౌడ్, శివ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.