ఆర్టీసీ బస్టాండ్‌లో దాహం దాహం..!
- ప్రైవేట్ వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తున్న నీటి కొరత
- పట్టించుకోని అధికారులు
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులు దాహంతో అలమటిస్తున్నారు. గతంలో ఎమ్మెల్సీ నాగేశ్వరరావు ఏర్పాటు చేసిన తాగునీటి ప్లాంట్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. గత ఏడాది వరకు సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా తాగునీరు అందించగా, ప్రస్తుతం ఆ సౌకర్యం ప్రారంభం కాలేదు. ఇటీవల ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బస్టాండ్‌లో తాగునీటి సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నిరుపేద ప్రయాణికులు దగ్గరలోని టీ స్టాళ్లు, హోటళ్లలో డబ్బులు చెల్లించి నీరు తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరికొందరు తప్పనిసరిగా వాటర్ బాటిళ్లు కొనుగోలు చేసి దాహం తీర్చుకుంటున్నారు. ఈ పరిస్థితిని అవకాశంగా మార్చుకున్న కొందరు ప్రైవేట్ వ్యాపారులు నీటి బాటిళ్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి బస్టాండ్‌లో ఉచిత తాగునీటి సౌకర్యాన్ని పునరుద్ధరించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. విషయంపై డిపో మేనేజర్ చక్రపాణి గౌడ్ స్పందిస్తూ ప్రయాణికుల దాహం తీర్చేందుకు శాశ్వత పరిష్కారంగా నీటి ప్లాంట్ ఏర్పాటు కొరకు దాతలను సమీకరిస్తున్నాం అన్నారు. ప్రస్తుతం చిన్న ఫ్రిడ్జ్ అందుబాటులోనే ఉందన్నారు.




