1 April, 2026 | 5:26 PM

రేషన్ కార్డు లబ్ధిదారులకు కేంద్రం శుభవార్త.. 3 నెలల రేషన్ ఒకేసారి!

01-04-2026 03:32 PM

హైదరాబాద్: రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు కేంద్రం(Central Government) గుడ్ న్యూస్ చెప్పింది. ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం  కీలక నిర్ణయం తీసుకుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వేసవి తాపం దృష్ట్యా మీరు పదేపదే రేషన్ షాపుల వద్ద క్యూ కట్టే ఇబ్బంది లేకుండా ఉండాలని, నేటి నుంచే ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎక్స్ లో పోస్టు చేశారు.

• బియ్యం పంపిణీ: ప్రతి లబ్ధిదారుడికి నెలకు 6 కేజీల చొప్పున, మూడు నెలలకు కలిపి ఒకేసారి మొత్తం 18 కేజీల బియ్యం పంపిణీ.

• అంత్యోదయ కార్డుదారులు: అంత్యోదయ కార్డు ఉన్న కుటుంబాలకు నెలకు 35 కేజీల చొప్పున, మూడు నెలలకు కలిపి మొత్తం 105 కేజీల రేషన్ వస్తుంది.

• ఇతర వస్తువులు: బియ్యంతో పాటు ఆయా నెలలకు కేటాయించిన ఇతర నిత్యావసర వస్తువులను కూడా నేటి నుంచే పొందే అవకాశం. గత వర్షాకాలంలో కూడా ప్రజల సౌకర్యార్థం ఇలాగే మూడు నెలల రేషన్‌ను ఒకేసారి కేంద్ర ప్రభుత్వం అందించింది. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, సాధ్యమైనంత వరకు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో రేషన్ షాపులకు వెళ్లి మీ కోటాను తీసుకోవాలని కిషన్ రెడ్డి ప్రజలను కోరారు.