పేమెంట్ గేట్‌వే ఫీజుపై క్యాష్ ఫ్రీ బంపరాఫర్
ముంబై , జూలై 2
భారతదేశపు ప్రముఖ ఏఐ -నేటివ్ పేమెంట్స్ కంపెనీ అయిన క్యాష్‌ఫ్రీ పేమెంట్స్, తమ ప్లాట్‌ఫామ్‌లో నమోదు చేసుకునే అన్ని కొత్త వ్యాపారాలకు పేమెంట్ గేట్‌వే ఫీజులను మినహాయిస్తున్నట్లు ప్రకటించింది. 31 మార్చి 2027 వరకు జరిపే మొదటి రూ. 20 లక్షల విక్రయాలపై (జిఎంవి) 0% ఫీజులను అందిస్తోంది. ఈ ఆఫర్ ప్రధానంగా తమ సొంత ఆన్‌లైన్ ఛానెళ్ల ద్వారా వ్యాపారాలను ప్రారంభిస్తోన్న , ఎదుగుతున్న వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని రూపొందించారు. ఈ ఆఫర్ ద్వారా, పండుగ సీజన్‌కు ముందు వ్యాపారాలకు ఒక నిజమైన ఆరంభ వేదికను అందించాలని క్యాష్‌ఫ్రీ పేమెంట్స్ లక్ష్యంగా పెట్టుకుంది.
చిరు వ్యాపారాలు తమ వార్షిక వ్యాపారంలో అధిక భాగాన్ని ఈ కాలంలోనే చేస్తాయి, అయినప్పటికీ సాధారణంగా ఇది దాని స్వంత వ్యయ ఒత్తిళ్లతో కూడి ఉంటుంది. అమ్మకాలు గరిష్ట స్థాయికి చేరుకున్న సమయంలోనే డిస్కౌంట్లు మరియు ఆఫర్లు లాభాలను తగ్గిస్తాయి, మరియు పేమెంట్ గేట్‌వే ఫీజులు ఆ లాభాలను మరింతగా హరించివేస్తాయి. ఈ సమయంలో తమ ఫీజును పూర్తిగా తొలగించడం ద్వారా, క్యాష్‌ఫ్రీ విక్రేతలకు నిజమైన లాభాలను మరియు నగదును తిరిగి అందిస్తోంది. దీనిని వారు సరుకు నిల్వలు, ప్రకటనలు లేదా లాజిస్టిక్స్‌లో తిరిగి పెట్టుబడిగా పెట్టవచ్చు.
చిన్న, మధ్య తరహా వ్యాపారాలు (ఎస్ఎంబి లు), డైరెక్ట్-టు-కన్స్యూమర్ (డి2సి) బ్రాండ్‌లు తమ వార్షిక అమ్మకాలలో సగటున 40 శాతాన్ని పండుగ సీజన్‌లోనే నమోదు చేస్తాయనీ క్యాష్‌ఫ్రీ పేమెంట్స్ సహ-వ్యవస్థాపకుడు సీఈఓ ఆకాష్ సిన్హా చెప్పారు. సంవత్సరంలో మరే ఇతర సమయంలో కంటే ఈ కాలంలో చెల్లింపుల వ్యవస్థ సరిగ్గా పనిచేయటం అత్యంత కీలకమనీ, పండుగ సీజన్‌కు ముందు మా ప్లాట్ ఫారంలో చేరిన కొత్త విక్రయదారులలో 90% మంది ఈ కాలంలో రూ. 20 లక్షల లోపు స్థూల వాణిజ్య విలువ (జిఎంవి)ను నమోదు చేస్తున్నాయని గమనించామన్నారు.
అందువల్ల, ఈ ఆఫర్ వారి మొత్తం పండుగ సీజన్ అమ్మకాలకు పూర్తిగా ఉపయోగపడుతుందనీ చెప్పుకొచ్చారు. ఫీజు మినహాయింపుతో పాటు, పరిశ్రమలో సాధారణంగా పట్టే అనేక రోజులకు బదులుగా, కొత్త వ్యాపారులు నమోదు చేసుకున్న కొద్ది నిమిషాల వ్యవధిలోనే క్యాష్‌ఫ్రీలో తమ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అంతేకాకుండా, సాధారణంగా రెండు రోజులకు బదులుగా, వారికి మరుసటి రోజే సెటిల్‌మెంట్ లభిస్తుంది. దీనివల్ల, అమ్మకాలు ఎక్కువగా ఉండే రోజుల్లో తదుపరి ప్రకటనల కోసం లేదా సరుకులను తిరిగి నింపడం కోసం నిధులు సమకూర్చుకోవడానికి నగదు ప్రవాహం మెరుగుపడుతుంది.






