పసిగుడ్డు మౌనిక మృతికి నిరసనగా ఎల్లారెడ్డిలో కొవ్వొత్తుల ర్యాలీ
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) కుమ్మెర గ్రామంలో అగ్రకులస్తుల దాడిలో చిన్నారి మౌనిక ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మౌనిక మృతికి నిరసనగా ఎల్లారెడ్డి పట్టణం లో రజక సంఘం ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం మండల కేంద్రంలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.స్థానిక చౌరస్తా నుండి సాగిన ఈ ర్యాలీలో రజక సంఘం నాయకులు,ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ నిశ్శబ్ద ప్రదర్శన చేపట్టారు. జై బీసీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.బీసీలపై సాగుతున్న దాడులను సహించేది లేదని, ఐక్యమత్యంతోనే ఇటువంటి అరాచకాలను అడ్డుకుంటామని హెచ్చరించారు.ఈ సందర్భంగా రజక సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ..ఏ పాపం తెలియని పసిగుడ్డుపై అగ్రకుల అహంకారంతో దాడి చేయడం అత్యంత దారుణమని,నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలి అని డిమాండ్ చేశారు.బలహీన వర్గాల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు,గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.




