8 August, 2026 | 9:26 AM

నాణ్యతతో కాలువలో డ్రాప్‌ పనులు చేపట్టాలి

08-08-2026 08:56 AM

కొండాపురం నుండిరెడ్లకుంట వరకు 20 కి.మీ. మేర రూ.47.64 కోట్లతో నిర్మాణం

బాలాజీనగర్‌ శివారులో కాలువలో జరుగుతున్న డ్రాప్‌ పనులను పరిశీలించిన ఈఈ సత్యనారాయణ

20,068 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు.. నాణ్యతపై అధికారులకు సూచనలు

కోదాడ(విజయక్రాంతి): భారీ వ్యయంతో చేపడుతున్న కాలువలో డ్రాప్‌ నిర్మాణ పనుల్లో నాణ్యతకు పెద్దపీట వేయాలని సూర్యాపేట ఈఈ జె. సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. కొండాపురం నుంచి రెడ్లకుంట వరకు 20 కిలోమీటర్ల మేర రూ.47.64 కోట్లతో చేపడుతున్న డ్రాప్‌ పనుల్లో భాగంగా కోదాడ పట్టణంలోని బాలాజీనగర్‌ శివారులో కాలువలో జరుగుతున్న డ్రాప్‌ నిర్మాణ పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు.పనుల నాణ్యత, పురోగతిని పరిశీలించిన ఈఈ.. డీఈ పంతుల్యను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కాలువలో డ్రాప్‌ నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, పనుల్లో ఎక్కడా రాజీ పడొద్దని స్పష్టం చేశారు. నిర్ణీత ప్రమాణాల మేరకు పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.ఈ కాలువ కింద సుమారు 20,068 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోందని ఈఈ తెలిపారు. కాలువలో డ్రాప్‌ నిర్మాణం పూర్తయితే నీటి పారుదల వ్యవస్థ మరింత మెరుగుపడే అవకాశం ఉందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పనులను సమన్వయంతో చేపట్టాలని సూచించారు. నిర్మాణ పనులపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డీఈ పంతుల్య, ఏఈతో పాటు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.