calender_icon.png 14 February, 2026 | 2:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతిష్టాత్మకం.. పుర పీఠం..!

14-02-2026 11:41:22 AM

  1. హస్తం ,గులాబీ వార్ 
  2. కాంగ్రెస్ కు దీటుగా బీఆర్ఎస్ 
  3. కాంగ్రెస్ వైపు స్వతంత్రుల అడుగులు ..?
  4. కొనసాగుతోన్న క్యాంపు రాజకీయాలు

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్(Bellampalli Municipality) రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఫలితాల్లో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ సమ ఉజ్జీలుగా చాటుకున్నాయి. అధికార పార్టీ వెంట ఫలితాల పరుగులో బీఆర్ఎస్ పరిగెత్తి దీటుగా నిలిచింది. 34 స్థానాల్లో 14 చొప్పున పంచుకొని కాంగ్రెస్ కు తాము ఏ మాత్రం తీసిపోమని బీఆర్ఎస్ నిరూపించుకుంది.

కాంగ్రెస్ కు  బీఆర్ఎస్ గట్టి పోటీనిచ్చింది. స్వతంత్ర అభ్యర్థులు ఐదుగురు, బీజేపీ ఒక స్థానంలో గెలిచి తమ ఉనికిని చాటుకొన్నారు. ఈ ఎన్నికల్లో సీపీఐ  6 స్థానాల్లో మాత్రమే పోటీ చేసింది. ప్రజలు కామ్రేడ్లను విశ్వసించలేదు. పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. బీజేపీ హిందుత్వం పారలేదు. 20 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ వారిని ప్రజలు పెద్దగా ఆదరించలేదు. ఒక్క స్థానంలో నిలిచి కొనఊపిరికి చేరింది.. సీపీఐ, బీజేపీ కంటే ఈ ఎన్నికల్లో స్వతంత్రులనే ప్రజలు కీలక స్థానంలో నిలబెట్టారు. చైర్మన్ ఎవరికి ఇవ్వాలో స్వతంత్రులే నిర్ణయాత్మక పాత్రలో కిరోల్ గా మారారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఫలితాల్లో పోటీపడిన నేపథ్యంలో చైర్మన్ పీఠం ప్రతిష్టాత్మకంగా మారింది. మెజార్టీ కోసం స్వతంత్రుల మద్దతు కోసం జోరుగా బీరసరాలు సాగుతున్నట్లూ తెలుస్తోంది.

ఎమ్మెల్యే గడ్డం వినోద్, మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఈ విషయంలో ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఐదుగురు స్వతంత్రులలో ఇప్పటికే 2 వార్డు స్వతంత్ర  అభ్యర్థి గా గెలుపొందిన నిచ్చకోల వంశీ కృష్ణ కాంగ్రెస్ శిబిరంలోకి వెళ్లారు. మిగిలిన నలుగురు టార్గెట్ గా సమీకరణలు జోరందుకున్నాయి. ఈ నలుగురు ఎటువైపు అనేది ఆసక్తిగా చర్చ జరుగుతుంది. బీజేపీ స్టాండ్ ఏంటనేది అంత చిక్కడం లేదు. మద్దతు కూడ కట్టుకునే ప్రక్రియలో అధికార పార్టీ ఒక అడుగు ముందుంజలో ఉందని చెప్పొచ్చు. ఇందులో ఎవరు సక్సెస్ అవుతారు అనేదానిపై వాడి వేడిగా చర్చ జరుగుతుంది.

చైర్పర్సన్ రేసులో వీరే..

బెల్లంపల్లి  మునిసిపల్ అధికార పీఠం కోసం ప్రధాన పార్టీల నుంచి చైర్మన్ గిరిని ఆశిస్తున్న వారిలోప్రధాన పార్టీల నుంచి పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి ఇద్దరూ కౌన్సిలర్లు చైర్మన్ గిరికి పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 7 వార్డులో గెలుపొందిన దావస్వాతి, 28 వార్డు నుంచి నెగ్గిన చిప్ప అర్చన ఆశిస్తున్నారు. ఈ ఇద్దరు  ఆశావాదులు ఎమ్మెల్యే గడ్డం వినోద్  ప్రధాన అనుచరుల సతీమణులు కావడం గమనార్హం. దావ రమేష్ , చిప్ప మనోహర్ చైర్మన్ పీఠం కోసమే తమ సతీమణులను ఎన్నికల బరిలోకి దించారు.

ఇద్దరు ఎవరికి వారే తమకే చైర్మన్ పీఠం దక్కుతుందని ధీమాతో ఉన్నారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఎవరికి అభయ ఇస్తారో చూడాలి. ఇక బీఆర్ఎస్ నుంచి చైర్మన్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న వారిలో ఒక్కరే కనిపిస్తున్నారు.18 వార్డు నుంచి గెలుపొందిన బత్తుల అనిత పేరు ప్రముఖoగా వినిపిస్తోంది. మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ సతీమణి  బత్తుల అనిత బీఆర్ఎస్  నుంచి చైర్మన్ సీటు ను ఆశిస్తున్న వారిలో ఏకైకులు. కాగా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పుర పగ్గాలను కైవసం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

అధికార పార్టీ నీ తలదన్నే రీతిలో సమీకరణలు చేస్తున్నారు. ఎక్కడా తగ్గేదెలేదన్నటుగా చాలెంజ్ పాలిట్రీక్స్ చేస్తున్నారు.  ఈ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల ప్రకారంగా చూస్తే బీఆర్ ఎస్ ఈ ఎన్నికలతో బలం పుంజుకుందని చెప్పచ్చు. అధికార పగ్గాలు ఒకవేళ చేజారిపోయినా గట్టి ప్రతిపక్షం పార్టీగా బీఆర్ఎస్ కీలకంగా మారుతుందనీ భావిస్తున్నారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రజల తరపున బీఆర్ఎస్ బలమైన ప్రతిపక్ష గళాన్ని వినిపించే అవకాశం ఉంటుందనీ పరిశీలకులు భావిస్తున్నారు.