పేదల పథకాలు ఆపొద్దు.. బీఆర్‌ఎస్ రాస్తారోకో
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బీమా పథకాలను కొనసాగించాలి
రామారెడ్డి, ఆగస్టు 17 (విజయక్రాంతి): కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బీమా పథకాలను ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం రామారెడ్డి మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు మెమోరండం సమర్పించారు.
బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సూచనలతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బీమా పథకాలను ప్రభుత్వం కొనసాగించాలని, అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి సలావత్ బుచ్చిరెడ్డి, నారాయణ రెడ్డి, పోతునూరి ప్రసాద్, పడిగేల శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, పోసానిపేట సర్పంచ్ సుద్దాల లక్ష్మణ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






