30 April, 2026 | 2:50 AM

ప్రజాపాలన నచ్చే కాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్ సర్పంచ్

30-04-2026 01:20 AM

శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు 

గుండాల, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): మండల పరిధిలోని రోళ్ళగడ్డ తండా బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్ భూక్యా మంగమ్మ, 4, 5, 7 వార్డు సభ్యులు , సుమారు 100 కుటుంబాలు బుధవారం పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్ల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.

వారిని ఎమ్మెల్యే పాయం పార్టీ కండువా కప్పి సాధారంగా ఆహ్వానించారు. అనంతరం సర్పంచ్ మంగ మ్మ మాట్లాడుతూ...కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మెచ్చి, తమ గ్రామపంచాయతీని అన్ని విధాలా అభివృద్ధి పరుచుకోవాలనే ఉద్దేశ్యంతో అలాగే బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న ద్వంద వైఖరి నచ్చక, పాయం వెంకటేశ్వర్లు చేస్తున్న అభివృద్ధి పనులు నచ్చి వారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు.   

అనంతరం రైతు వేదికలో ఏర్పాటు చేసిన  ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం పాల్గొని అంగన్వాడీ టీచర్లకు 60 స్మార్ట్ ఫోన్లను, 14 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి / షాదీ ముబారక్ చెక్కులను, ఆరుగురు లబ్ధిదారులకు రూ. రెండు లక్షల విలువ గల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు.

అంగన్వాడీ టీచర్లు ప్రభుత్వ సేవలను గ్రామ స్థాయిలో సమర్థవంతంగా అందిస్తున్నారని, వారికి సాంకేతిక సదుపాయాలు కల్పించడం ద్వారా సేవలు మరింత వేగవంతం అవుతాయని అన్నారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ, వ్యక్తిగత వివరాలను రక్షించుకోవాలని సూచించారు. పిల్లల భద్రత మరియు రక్షణపై శ్రద్ధ తీసుకోవాలని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.