మొక్కజొన్న కంకులతో అసెంబ్లీకి బీఆర్ఎస్ నేతలు.. హరీష్ రావు చేతికి గాయం
హైదరాబాద్: మొక్కజొన్న రైతులను ఆదుకొని మద్దతు ధర ఇవ్వడంతో పాటు రూ. 500 బోనస్ ఇచ్చి, కొనుగోలు కేంద్రాలను తక్షణం ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. చేతుల్లో మొక్కజొన్న కంకులు పట్టుకుని రైతులకు మద్దతుగా నిరసన తెలిపారు. అనంతరం అక్కడి నుంచి నిరసన తెలుపుతూ అసెంబ్లీకి వస్తున్న బీఆర్ఎస్ సభ్యులను ఎంట్రీ పాయింట్ వద్ద పోలీసులు, మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.
ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై మార్షల్స్ దురుసుగా ప్రవర్తించారు. ప్రజాప్రతినిధులు అని కూడా చూడకుండా వారి చేతుల్లో ఉన్న మొక్కజొన్న కంకులను మార్షల్స్ లాక్కోవడంతో మాజీ మంత్రి హరీష్ రావు చేతికి గాయమై రక్తం కారింది. పోలీసుల, మార్షల్స్ తీరుపై ఎమ్మెల్యేలు మండిపడ్డారు. అసెంబ్లీ లోపలికి వెళ్లే ద్వారం వద్ద బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా హరీశ్ రావు మాట్లాడుతూ... ఎనిమిది లక్షల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పండించారని తెలిపారు. మద్దతు ధర లేక మొక్కజొన్న రైతులు నష్టపోతున్నారని వాపోయారు.
వర్షాల కారణంగా రైతులు నష్టపోతున్నారని ధ్వజమెత్తారు. 25 శాతం పంట దళారుల చేతికి వెళ్తుందని ఆరోపించారు. పంటల బీమా అమలు చేయట్లేదని మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ పుట్ సబ్సిడీని తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. మద్దతు ధర రూ. 2,400, బోనస్ రూ. 500 ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల వైఖరి నశించాలంటూ నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సభలోకి అడుగుపెట్టారు. మూడో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై కొనసాగుతున్నాయి.




