2 March, 2026 | 6:58 AM

అరణ్య శ్వాస

02-03-2026 01:57 AM

పూర్వమొకసారి-

జీవితవికసనచంద్రకౌముదీ కాంతిలో

అడవిజింక వలే సిగ్గరిగానూ,

అడవిలోని గాలులున్నట్లుగా 

స్వచ్ఛంగా అడవి సంబంధమైనది గానూ

వన్యశిశువుగా- అప్పుడు 

నా ఊపిరి ఉనికి, ఇప్పటికీ నా మనికి!

పాడే పక్షుల సంచారాలను అన్వేషిస్తూ,

వాటి పాటలకు ప్రతిసమాధానాన్ని అప్పగిస్తూ,

వనమధ్యమైదానాల వంకల, డొంకల వెంబడి

అల్లాడుతుండే పాటల చిట్టినీలిపక్షి 

పిలుపును తెలుసుకుంటుంటాను !

సెలయేటి సరిగమస్వరాల అవరోహణలనూ,

ఏకరీతి జపమంత్ర గీతాలాపననూ

రాళ్లలో పారుతూ సవ్వడిగా సాగే

ఆ ఏటి గలగలల హెచ్చుతచ్చుల రాగాలనూ

రాగ గమకాలనూ వింటుంటాను!

లోయల నీడలలో కలలు కంటూ

వెలుగు కొండలపై నాట్యమాడుతూ

అద్భుతాల అరణ్యనిసర్గపు బావుల నుంచి

నవసంతోషామృతాలను గ్రోలుతుంటాను

పుష్పాల భాషను నేర్చుకుంటూ

ఊదారంగు పువ్వుల

పసుపు వన్నె‘డాఫోడిల్’ పువ్వుల

తెల్లటి రేకల ‘డైసీ’ పువ్వుల

అరుణవర్ణపు ‘ఆర్కిడ్’ పువ్వుల

అడవి గులాబీ పువ్వుల-

రహస్యాలను నావిగా చేసుకుంటుంటాను !!

ఆంగ్లమూలం: లిలియన్ లెవరిడ్జ్  

(ఏ బ్రీత్ ఆఫ్ ది వుడ్స్)

 స్వేచ్ఛానువాదం: *రఘువర్మ’,