విలేకరి ముసుగులో బ్లాక్‌మెయిల్ దందా
"ఐదు లక్షలు ఇవ్వండి.. లేదంటే వార్త రాస్తా" బంగారం వ్యాపారులకు బెదిరింపు
మేమేం తప్పు చేశాం? ఏం రాసుకుంటావో రాసుకో" తిరగబడ్డ వ్యాపారులు
రెండు రోజులుగా మూతపడ్డ దుకాణాలు
తాండూర్,(విజయక్రాంతి): కలం కత్తికంటే పదునైనదని నిరూపించాల్సిన జర్నలిస్టు, అదే కలాన్ని బ్లాక్‌మెయిల్ ఆయుధంగా చేసుకుంటున్నాడన్న విమర్శలు వినవస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే వికారాబాద్ జిల్లా తాండూర్ కు చెందిన ఒక దినపత్రిక విలేకరి స్థానిక బంగారం వ్యాపారులను టార్గెట్ చేసి దుకాణాల వద్ద ఫోటోలు తీస్తుండగా మీరెవరు? ఫోటోలు ఎందుకు తీస్తున్నారు? అని అక్కడున్నవారు ప్రశ్నించారు.
నేను విలేకరినని బదులు ఇవ్వడంతో సరే మా సంక్షేమ సంఘం పెద్దలు ఉన్నారు వారి వద్దకు పోదామని తీసుకెళ్లారు. అతడిని షాపులో కూర్చోబెట్టి నీకు ఎవరు పంపారు?నీకేం కావాలి ? అడుగగా నేను ఆంధ్రప్రభ విలేకరి మహేష్ నని వేణుగోపాల్ రెడ్డి పంపాడని చెప్పడంతో వెంటనే అక్కడున్న వారు వేణుగోపాల్ రెడ్డిని ఫోన్ లో సంప్రదించారు "ఐదు లక్షలు ఇస్తారా? లేదంటే మీ మీద వార్త రాస్తా" అంటూ బ్లాక్ మెయిల్ కు దిగారని బంగారం వ్యాపారస్తులు ఆరోపిస్తున్నారు.
వ్యాపారుల తిరుగుబాటు:
అయితే ఆ వ్యాపారులు ఏమాత్రం బెదరలేదు. "మేము నిజాయితీగా వ్యాపారం చేసుకుంటున్నాం. నువ్వు అడిగినట్టు ఐదు లక్షలు ఎందుకు ఇవ్వాలి? మేమేం తప్పు చేశాం? నీకు చేతనైంది రాసుకో, నీ ఇష్టం వచ్చింది చేసుకో" అంటూ సదరు విలేకరికి గట్టిగా బదులిచ్చి పంపించేశారు. వ్యాపారుల ధైర్యానికి స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తనను నిర్బంధించారని విలేకరి, తమకు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని బంగారం వ్యాపారస్తులు పట్టణ పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.
చట్టపరమైన చర్యలకు డిమాండ్:
బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన విలేకరి మహేష్, వేణుగోపాల్ రెడ్డి పై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బంగారు వ్యాపార, స్వర్ణకార సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా పాత్రికేయ సంఘం కూడా దీనిపై విచారణ జరిపి బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయమై ఇరువురి పై కేసు నమోదు చేసినట్లు సిఐ పరమేశ్వర్ తెలిపారు.






