చిన్నారుల మిస్సింగ్ కేసులపై సుప్రీంకోర్టు ఆందోళన
న్యూఢిల్లీ: ఇకనుంచి ఎక్కడైనా పిల్లలు తప్పిపోతే కిడ్నాప్ కేసుగా నమోదు చేయాలని సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశించింది. ప్రత్యేక పోర్టల్ తో అఖిలభారత పోలీస్ గ్రిడ్(All India Police Grid) ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మానవ అక్రమ రవాణా తీవ్రతను ఎవరూ గుర్తించడం లేదని పేర్కొంది. తమిళనాడులో జరిగిన ఘటనపై దాఖలైన పిటిషన్ విచాణలో నిన్న కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
చెన్నైకు చెందిన గణేశ్ వేసిన పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం శనివారం నాడు విచారణ జరిపింది. ప్రస్తుతం అదృశ్యమైన పిల్లల సంఖ్య 47 వేలు ఉందని తెలిపింది. ఈ సంఖ్య ఏటా పెరుగుతోందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. తప్పిపోతున్న వారు, వారి ఆచూకీ కనిపెట్టడం మధ్య చాలా అంతరం ఉందని కోర్టు వెల్లడించింది. గతేడాది 10 వేల మంది పిల్లలు తప్పిపోయినట్లు సుప్రీంకోర్టు గుర్తుచేసింది.
మానవ అక్రమరవాణా నెట్ వర్క్(Human Trafficking Network) లో చిక్కుకుంటున్నార్న వాదనతో కోర్టు ఏకీభవించింది. దొరికిన పిల్లలకు ఆధార్ నమోదు, ధ్రువీకరణ తప్పనిసరిగా చేయాలని కోర్టు ఆదేశించింది. తమ ఆదేశాలను రాష్ట్రాలు ఎలా అమలు చేస్తాయో చూసి ఆదేశాలు ఇస్తామని సూచించింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఆగస్టు కు వాయిదా వేసింది.






