ఘనంగా ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య జన్మదిన వేడుకలు
మరోసారి బీర్ల ఐలయ్య ఎమ్మెల్యే, మంత్రిగా సేవలను అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు
యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆలేరు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలను అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు. శనివారం యాదగిరిగుట్ట పట్టణంలోని బీర్ల నిలయం వద్ద ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే అభిమానులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో హాజరై జన్మదిన వేడుకలను ఉత్సాహభరితంగా జరిపారు. 51వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బీర్ల ఐలయ్య ఉదయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం యాదగిరిగుట్ట పట్టణంలోని బీర్ల నిలయం వద్ద నిర్వహించిన వేడుకల్లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అర్చకులు బీర్ల అయిలయ్యకి ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులకు నిత్యావసర ఆహార సరుకులను పంపిణీ చేశారు. అనంతరం ఆలేరు నియోజకవర్గం, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు, నాయకుల సమక్షంలో జన్మదిన వేడుకలు అట్టహాసంగా కొనసాగాయి.అభిమానులు ఏర్పాటు చేసిన భారీ క్రేన్ గజమాలతో బీర్ల అయిలయ్యని ఘనంగా సత్కరించారు.
సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించగా, పలువురు యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.అదేవిధంగా విద్యార్థులకు నోటుబుక్స్ పంపిణీ చేసి వారి విద్యాభివృద్ధికి తన సహకారాన్ని తెలియజేశారు.ఉదయం నుండి సాయంత్రం వరకు బీర్ల నిలయం వద్ద అభిమానులు, ప్రజలు, కార్యకర్తల రాకపోకలతో ప్రాంతం జనసంద్రంగా మారింది.జన్మదిన వేడుకలు ఆనందోత్సాహాల మధ్య వైభవంగా సాగాయి.ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి, అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు, జాయింట్ కలెక్టర్ వెంకారెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






