5 July, 2026 | 2:24 AM

టీఆర్‌ఎస్‌కు భారీషాక్

05-07-2026 12:48 AM
  1. 15 రోజుల్లోగా ౩ ప్రత్యామ్నాయ పేర్లు సమర్పించాలి
  2. పంపకపోతే దరఖాస్తు మూసేస్తామని ఈసీ హెచ్చరిక
  3. న్యాయ పోరాటం చేస్తాం: కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): ‘తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్)’ పేరుతో ప్రజల్లోకి వెళ్తోన్న కవితకు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా బిగ్ షాక్ ఇచ్చింది. తన పార్టీ పేరును ‘తెలంగాణ రక్షణ సేన’గా నిర్ణయించి రిజిస్ట్రేషన్ కోసం కవిత ఈసీకి దరఖాస్తు చేసుకోగా ఈ పేరుపై కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పేరుపై సుమారు వెయ్యికి పైగా అభ్యంతరాలు వచ్చాయని, అందువల్ల మూడు ప్రత్యామ్నాయ పేర్లను తమకు సమర్పించాలని సూచించింది.

ఈ మేరకు తాజాగా కవితకు ఎన్నికల సంఘం లేఖ రాసింది. ప్రత్యామ్నాయ పేర్లు 15 రోజుల్లోగా తమకు పంపకపోతే పార్టీ నమోదు దరఖాస్తును ఎలాంటి తదుపరి సమాచారం ఇవ్వకుండా మూసివేస్తామని హెచ్చరించింది. ఇకపై టీఆర్‌ఎస్ పేరు కొనసాగించేందుకు వీల్లేదని సూచించింది. ఈసీ నుంచి వచ్చిన 2 అభ్యంతరాలకు కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈసీ కోరినట్లు ప్రత్యామ్నాయంగా కొత్త పేర్లు ఇచ్చే ప్రసక్తే లేదని, ఈ విషయంలో న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.

కేంద్ర ఎన్నికల సంఘం కేవలం రెండు అభ్యంతరాలను మాత్రమే తమకు పంపారని, వాటికి సమాధానం ఇచ్చామని తెలిపారు. మిగతా అభ్యంతరాలు పంపించకుండా ప్రత్యామ్నాయ పేర్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. అయితే బీఆర్‌ఎస్‌ను విభేదించిన కవిత సొంత పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్తున్న తరుణంలో పార్టీ విషయంలో ఎదురవుతున్న చిక్కులు కవిత రాజకీయ భవిష్యత్‌పై చర్చకు దారి తీస్తోంది.