పరదర్శకంగా భూ రీ-సర్వే చేయాలి
ఆసిఫాబాద్(విజయక్రాంతి): దహెగాం మండలంలోని అమర్‌గొండ గ్రామంలో జరుగుతున్న భూ రీ-సర్వే పనులను జిల్లా కలెక్టర్ కే. హరిత శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వ్యవసాయ భూముల గ్రౌండ్ ట్రూతింగ్, గ్రామ పొలిమేరలు, ఆవాస ప్రాంతాల సరిహద్దులు, ప్రభుత్వ భూముల వివరాలను పరిశీలించి సర్వే పురోగతిపై అధికారులతో సమీక్షించారు. రీ-సర్వేలో వినియోగిస్తున్న జీ ఎన్ ఎస్ ఎస్ రోవర్ పరికరాలు, కంట్రోల్ పాయింట్ల పనితీరును కలెక్టర్ స్వయంగా పరిశీలించి సర్వే సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
గ్రామ విస్తీర్ణం, ప్రభుత్వ భూములు, సర్వే నంబర్లు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం రైతులు, గ్రామస్థులతో మాట్లాడి రీ-సర్వేపై వారి అభిప్రాయాలు, వినతులు, అభ్యంతరాలను స్వీకరించారు. భూ సరిహద్దుల ఖచ్చితమైన నిర్ధారణ, రికార్డుల సమగ్ర పరిశీలన, రైతుల భాగస్వామ్యం కీలకమని కలెక్టర్ తెలిపారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్వే, భూ రికార్డుల సహాయ సంచాలకులు వినయ్‌కుమార్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే రామేశ్వర్, మండల సర్వేయర్ ధన్‌రాజ్, రెవెన్యూ, సర్వే శాఖల సిబ్బంది పాల్గొన్నారు.






