29 August, 2026 | 5:25 PM

సామాజిక సేవకు అరుదైన గౌరవం

29-08-2026 03:42 PM

డాక్టరేట్ పొందిన దేవార వినోద్ స్వామి

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రజా సేవే లక్ష్యంగా, మానవత్వమే మార్గంగా ఎన్నో సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న దేవార వినోద్ స్వామికి అరుదైన గౌరవం దక్కింది. సామాజిక సేవా రంగంలో ఆయన అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తించిన యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ ఫర్ లీడర్‌షిప్ అండ్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో “డాక్టర్ ఆఫ్ సోషల్ సర్వీస్” గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు.శనివారం పుదుచ్చేరిలోని కంబన్ కలైయరంగం ఆడిటోరియంలో నిర్వహించిన “సామాజిక నాయకులు–దార్శనికుల సమ్మేళనం–2026” కార్యక్రమంలో దేవార వినోద్ స్వామికి ఈ గౌరవాన్ని అందజేశారు. దేవార వినోద్ స్వామి వేసవి కాలంలో మూడు నెలల పాటు అంబలి, మంచినీటి పంపిణీతో పాటు పేదలు, వృద్ధులకు దుప్పట్లు, యువతకు వాలీబాల్, క్రికెట్ కిట్లు, గర్భిణులకు పౌష్టికాహారం, వస్త్రాలు, నిత్యావసర వస్తువులు అందిస్తున్నారు.

అగ్ని ప్రమాదాల్లో ఇళ్లు కోల్పోయిన కుటుంబాలకు, తలసీమియా బాధితులకు ఆర్థిక సహాయం అందిస్తూ అండగా నిలుస్తున్నారు.కరోనా సమయంలోనూ పలు గ్రామాల్లో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. తల్లిదండ్రులు లేని నిరుపేదల వివాహాలకు సొంత ఖర్చుతో ఇప్పటివరకు 25 జంటలకు మంగళసూత్రాలు, మట్టెలు, వస్త్రాలు, వంటపాత్రలు, నిత్యావసర సరుకులు అందించి వివాహాలు జరిపించారు. అలాగే వందలాది మందికి ఉచిత కంటి ఆపరేషన్లు, చర్మ, దంత వైద్య పరీక్షలు, మందులు అందించారు. గ్రామాల్లో ఎవరైనా మృతి చెందితే వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులు అందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.“సేవే లక్ష్యం.. మానవత్వమే మార్గం” అనే సందేశంతో యువతను కూడా సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తున్నారు.

ఆధ్యాత్మిక సేవతో పాటు అన్నదానం, వైద్య సహాయం, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న ఆయన సేవలకు గౌరవ డాక్టరేట్ లభించడంపై ప్రజాప్రతినిధులు, సామాజిక సేవకులు, యువత, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. పురస్కారాల కోసం కాకుండా ప్రజల కోసం చేసే సేవకే నిజమైన గుర్తింపు లభిస్తుందనే విషయాన్ని దేవార వినోద్ స్వామి సేవా ప్రస్థానం నిరూపిస్తోందని పలువురు పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ డైరెక్టర్, తమిళనాడు మాజీ న్యాయమూర్తి డాక్టర్ కె. వెంకటేశన్ అధ్యక్షత వహించగా, తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.ఆర్. శంపత్, ఐఏఎస్, ప్రపంచ శాంతి సంస్థ–ఐక్యరాజ్యసమితి ప్రతినిధి డాక్టర్ పర్విందర్ సింగ్, అంతర్జాతీయ న్యాయవాది డాక్టర్ కావేటి శ్రీనివాసరావు, యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ పి. అమృతవల్లి తదితరులు పాల్గొన్నారు.