calender_icon.png 14 February, 2026 | 11:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముస్తాబైన చింతల బయ్యారం శివాలయం..!

14-02-2026 09:47:25 PM

- శివాలయాల్లో కొనసాగనున్న ప్రత్యేక పూజలు 

- భక్తులకు చలువ పందిళ్లు..ప్రత్యేక క్యూ లైన్లు

- గోదావరి నది తీరాన స్నాన ఘట్టాలు

పినపాక,(విజయక్రాంతి): మండల వ్యాప్తంగా ఈ నెల 15వ తేదీ మహాశివరాత్రిని పురస్కరించుకొని జరగబోయే శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి చింతల బయ్యారం, సీతంపేట, దుగిగేపల్లి, గొట్టెల్ల శివాలయాలు ముస్తాబవుతున్నాయి. ముఖ్యంగా పాత రెడ్డిపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని చింతలబయ్యారం గ్రామ సమీపంలోని గోదావరి నది తీరాన స్వయంభుగా వెలిసినటువంటి కాకతీయుల కాలంనాటి చారిత్రకమైన చరిత్ర కలిగిన పురాతనమైన శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి ఆలయం సర్వసుందరంగా ముస్తాబైంది. సాంప్రదాయ బద్ధంగా మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనునట్లు ఆలయ కమిటీ తెలిపారు.

తెల్లవారుజామున 4గంటల నుండి భక్తులు గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరిస్తారు.6గంటల నుండిఅభిషేకాలు పూజలు నిర్వహించినట్లు తెలిపారు. స్వామి వారి కళ్యాణం రాత్రి 2 30 నిమిషాలు జరుగును.అనంతరం ఈశివపార్వతుల కళ్యాణ మహోత్సవ వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీ ఉమా నీలకంటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటుంటారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరుకానున్న నేపద్యంలో ఆలయకమిటి వారు శివాలయ ప్రాంగణం చుట్టూ విద్యుత్ దీపాలంకరణ భారీ ఎత్తున చేస్తున్నారు.దేవతా మూర్తుల విద్యుత్ కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు.

కళ్యాణ మహోత్సవంలో భాగంగా చివరి రోజు నిర్వహించే కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి ఊరేగింపునకు రథోత్సవానికి సుందరంగా పల్లకిని మెరుగులు దిద్దుతున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పరిసరాలను పరిశుభ్ర పరుస్తూ, సర్వసుందరంగా తీర్చిదిద్దుతున్నారు. భక్తుల కోసం చలువ పందిళ్లు, ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు.అదే విధంగా గోదావరి నది తీరాన లోతు ప్రదేశం హెచ్చరిక బోర్డులుఏర్పాటు చేశారు.

గోదావరి దగ్గర స్నానమాచరించే వారికి ముఖ్యంగా మహిళలు ఎలాంటి అసౌకర్యాలకు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక స్నాన ఘట్టాలను ఏర్పాటు చేస్తున్నారు. ఉపవాస దీక్షలతో భక్తులు శివపార్వతుల సన్నిధిలో జాగారణ చేస్తుంటారు. ఇదిలా ఉండగా ట్రాఫిక్ ను క్రమబద్ధీకరణకు పోలీస్ లు, పంచాయతీ అధికారులతో సమస్వయంగా చర్యలు చేపట్టి వాహనాల పార్కింగ్ ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. శివపార్వతుల దర్శనానికి వచ్చే భక్తులు భక్తి శ్రద్ధలతో ఆలయ కమిటీ నియమ నిబంధనలు పాటిస్తూ పూజా కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

జాతరకు వచ్చే పిల్లలు,పెద్దలను అలరించడానికి భజన, కోలాట సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ పరిసరాల్లో పెద్దఎత్తున మంచి నీరు సదుపాయం, మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంతే కాకుండా వైద్య ఆరోగ్య శాఖ అత్యవసర చికిత్స నిమిత్తం ప్రత్యేక ఆరోగ్య కేంద్రాన్నిఏర్పాటు చేస్తున్నారు. చింతల బయ్యారం ఆలయ కమిటీ, అధికారులు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపడుతున్నారు.