25 February, 2026 | 5:20 PM

రజక కులానికి చెందిన పాప మరణం దారుణం

25-02-2026 03:26 PM

బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్ రూపునార్

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన ఘటనలో రజక కులానికి చెందిన చిన్నారి మరణించడం దారుణమని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్ రూపునార్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ నెల 18న కుమ్మెర గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఒక మహిళ తన చిన్నారితో ఆలయంలోకి ప్రవేశించిందన్నారు.

ఈ సమయంలో గ్రామ సర్పంచ్‌తో పాటు కొందరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఆమెపై దుర్భాషలాడి, విచక్షణారహితంగా దాడి చేశారని ఆరోపించారు. దాడిలో చిన్నారి కిందపడటంతో తీవ్రంగా గాయపడిందన్నారు. తల్లి వెంటనే చిన్నారిని వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని తెలిపారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

ఈ ఘటనకు బాధ్యులైన వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ మండల రజక సంఘం అధ్యక్షుడు వేములవాడ గణపతి, తిర్యాణి మండల రజక సంఘం అధ్యక్షుడు రేగళ్ల రాజమౌళి, సంఘ సభ్యులు వేములవాడ రమేష్, పిప్రే సాయి, రాములు, చిరంజీవి, అశోక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.