పురుగుల అన్నం మాకొద్దు సార్...
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న హాస్టల్ అధికారులను సస్పెండ్ చేయాలి.
చేవెళ్ల,(విజయక్రాంతి): సార్.. మేము ఈ పురుగుల అన్నం తినలేక పోతున్నాం. వారానికోసారి అన్నంలో పురుగులు వస్తున్నాయి అంటూ బీసీ విద్యార్థులు వాపోయారు. ఎస్ఎఫ్ఐ నాయకులు శుక్రవారం సాయంత్రం చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలోని బీసీ హాస్టల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిత్యం ఎదురవుతున్న సమస్యలను ఎస్ఎఫ్ఐ నాయకుల దృష్టికి తీసుకువెళ్లారు. విద్యార్థుల సమస్యలు విన్న ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ కార్యదర్శి బేగరి అరుణ్ కుమార్ మాట్లాడుతూ... హాస్టల్లో కుక్ ను అన్నంలో పురుగులు వస్తున్నాయని వివరణ అడిగితే ప్రతిరోజు ఇలాగే పురుగులు వస్తున్నాయని బియ్యం పైనుంచి పురుగులతో సప్లై అవుతున్నాయని సమాధానం ఇచ్చాడు.
బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారుల నిర్లక్ష్యం వల్లనే పేద విద్యార్థులు చదువుకుంటున్న సంక్షేమ హాస్టళ్లకు నాసిరకం బియ్యం సప్లై చేస్తున్న రేషన్ డీలర్ లైసెన్స్ రద్దు చేయాలని అతనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. హాస్టల్లో నాసిరకం బియ్యం పాడైపోయిన కూరగాయలతో విద్యార్థులకు భోజనం వండుతున్నారని దీనిపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ చేవెళ్ల మండల కార్యదర్శి మాల చందు, ఎస్ఎఫ్ఐ నాయకులు అశోక్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.






