22-02-2026 01:38:50 AM
పేదరికమే ఈ స్థాయికి చేర్చింది
పాలమూరు కార్పొరేషన్ మేయర్ గుమల్ మమత శ్రీనివాస్
మహబూబ్ నగర్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): చాలా పేదరిక కుటుంబం మాది. ఒకప్పుడు ఇంటి అద్దెను కూడా కట్టుకోలేని స్థితిలో ఉండి నిరంతరం కష్టపడి పనిచేశాం. ఎలాగైనా పదిమందికి సేవ చేయాలనే సంకల్పంతో ఎంతో ఓర్పుతో కష్టపడి అందరి మన్ననలు పొందుతున్నాం. అప్పనపల్లి పరిధిలోని మూడో డివిజన్ వాసులు ఎంతో మద్దతు తెలియజేశారు. ఏమీ లేదని ఏనాడూ కృంగిపోలేదు. మనకున్న దాంట్లో పదిమందికి సేవ చేస్తూ ముందుకు పోవాలన్నదే మా సిద్ధాంతం.
అదే చేస్తూ వచ్చాం. అందరి ఆశీర్వాదంతో పాలమూరు తొలి మేయర్‌గా అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నా. ప్రజాసేవలో ఉంటూ వస్తున్నాం. తమకు చేతనైనంత పదిమందికి సహాయం చేస్తూ ఉన్నదాంట్లో సర్దుకుపోయి నా భర్త శ్రీనివాస్ అడుగుజాడల్లో నడుస్తూ వస్తున్నాను. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సహకారంతో 60 డివిజన్లను పూర్తిస్థాయిలో తమ డివిజన్‌గా భావించి అందరి మెప్పును పొందేలా పనిచేస్తాం. కాలనీలో ఎప్పుడు ఏ అవసరం ఉన్నా అందుబాటులో ఉండి సేవ చేసేందుకు తమ శక్తి మేరకు కృషి చేస్తాం.
బిడ్డలకు చదువు చెప్పా.. పురపాలిక రూపురేఖలు మారుస్తా
దేవరకద్ర మున్సిపల్ చైర్‌పర్సన్ దమయంతి
మహబూబ్ నగర్, ఫిబ్రవరి 20 (విజయ క్రాంతి): ఉపాధ్యాయురాలిగా ఎంతో మంది విద్యా ర్థులకు పాఠాలు నేర్పి ఉన్నత శిఖరాలు చేరుకునేలా నా శక్తి మేరకు సహాయ శక్తులా కృషి చేశాను. గత ఏడాది ఉద్యోగ విరమణ పొందా ను. నేను పాఠాలు చెప్పిన విద్యార్థులు ఎంతోమంది ఉన్నత స్థాయి లో ఉన్నారు. విద్యార్థులకు మంచి చేశాను కాబట్టి భగవంతుడు మొదటిసారిగా ఏర్పాటైన దేవరకద్ర మున్సిపాలిటీకి చైర్‌పర్సన్ అయ్యే అవకాశాన్ని కల్పించడం అదృష్టంగా భావిస్తున్నాను.
ఎమ్మెల్యే జీ మధుసూదన్‌రెడ్డి సహకారంతో మొదటి చైర్‌పర్సన్‌గా కావడం చాలా సంతోషాన్ని కలిగించింది. ప్రతి సమస్యపై పూర్తిస్థాయిలో అవగాహన ఉంది. దేవరకద్ర మున్సిపాలిటీ అన్ని విధా లుగా ప్రథమ స్థానంలో ఉంచేందుకు ఎమ్మెల్యే సహకారంతో కృషి చేస్తాను. ప్రజలకు అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉంచేందుకు నిరంతరం శ్రమిస్తూ అభివృద్ధి వైపు అడుగులు వేస్తాం.
ప్రజాసేవకే మా కుటుంబం అంకితం.. భూత్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధే నా లక్ష్యం
భూత్పూర్ వైస్‌చైర్‌పర్సన్ లిక్కి సూర్యకళ సాయన్నగౌడ్
భూత్పూర్, ఫిబ్రవరి 21(విజయక్రాంతి): లిక్కి కుటుంబం ప్రజా సేవే లక్ష్యంగా భూత్పూర్ మున్సిపాలిటీలో రాత్రింబవళ్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల మనుషులుగా వారి గుండెల్లో నిలిచిపోయారు. భూత్పూర్ మున్సి పాలిటీ కేంద్రానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి లిక్కీ సాయన్నగౌడ్ సూర్య కళ కుటుంబం పట్టణ ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలందిస్తూ గతంలో తొమ్మిదో వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందారు. నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ పార్టీ విధేయులుగా దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే జీ మధుసూదన్‌రెడ్డికి నమ్మిన బంట్లుగా ఉంటూ ఇటీవలే జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆమె ఘన విజయం సాధించారు.
లిక్కి సూర్యకళ రెండోసారి గెలిచిన సందర్భంలో ఆ కుటుంబానికి మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్‌గా అవకాశం దక్కింది. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ సూర్యకళ మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా మా కుటుంబం ప్రజల సేవకే అంకితం అయ్యింద న్నారు. రాబోయే రోజుల్లోనూ భూత్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి చేస్తాను. కొన్ని సంవత్సరాలుగా మున్సిపాలిటీలో తన సొంత నిధులతో వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించామన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని ఆమె తెలిపారు.
గద్వాల పట్టణ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా
మున్సిపల్ చైర్‌పర్సన్ జయలక్ష్మి
గద్వాల, ఫిబ్రవరి 21(విజయక్రాంతి): గద్వాల పట్టణ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని గద్వాల మున్సిపల్ చైర్‌పర్సన్ జయలక్ష్మినర్సింహులు యాదవ్ అన్నారు. గద్వాల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా నాపై నమ్మకం నుంచి నాకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యేకి ప్రత్యే క ధన్యవాదాలు తెలిపారు. గద్వాల పట్టణ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. గద్వాల పట్టణంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా పారిశుధ్య, వీధిదీపాలు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలను ఎప్పటికప్పుడూ పరిష్కరిస్తామన్నారు.
ప్రతి వార్డ్ పై ప్రత్యేక దృష్టి పెట్టి వార్డు అభివృద్ధితోపాటు గద్వాల పట్టణ అభివృద్ధికి నా వంతు సహాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే సహకారంతో భవిష్యత్‌లో గద్వాల మున్సిపాలిటీ రాష్ట్రంలోని ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యేకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలిపారు.
వడ్డేపల్లి మున్సిపాలిటీలో సమస్యలు పరిష్కరిస్తా
వడ్డేపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ నాయకి మంజుల
అలంపూర్, ఫిబ్రవరి 20: గ ద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ చైర్మన్ గా నాయకి మంజుల పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈమె బీసీ (నాయకి )సామాజిక కులానికి చెందినది. ఈమె 7 తరగతి వరకు చదువుకుంది. వడ్డేపల్లి మున్సిపాలిటీలో మాజీ జడ్పీటీసీ వడ్డేపల్లి శ్రీనివాసులు అండదండలతో ఏఐఎఫ్‌బీ తరుఫున మున్సిపల్ ఎన్నికల్లో నాలుగవ వార్డులో గెలిచి చైర్‌పర్సన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యంగా ఈరోజు ఈ పదవీ రావడానికి ప్రధాన కారణం వడ్డేపల్లి శ్రీనన్న. ఆయన అండ దండలతో మొదటి ప్రయత్నంలోనే మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నిక కావడం ఆనందాన్నిచ్చిందని నాయకి మంజుల తెలిపారు.