మండల వ్యాప్తంగా ఘనంగా బక్రీద్ వేడుకలు
మఠంపల్లి మే 28(విజయ క్రాంతి): బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని మండల వ్యాప్తంగా ఘనంగా బక్రీద్ వేడుకలు జరిగాయి.ఈ సందర్భంగా ఎస్సై బి.ప్రవీణ్ కుమార్ ముస్లిం సోదర సోదరీమణులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఆయన మండల పరిధిలోని రఘునాథ పాలెం గ్రామంలో ఈద్గా ప్రాంగణంలో మాట్లాడుతూ బక్రీద్ పండుగ త్యాగానికి, ప్రేమకు, సోదర భావానికి ప్రతీక అని పేర్కొన్నారు. సమాజంలో శాంతి, సామరస్యం, పరస్పర గౌరవం మరింత బలపడాలని ఆకాంక్షించారు.ప్రతి ఒక్కరూ పండుగను ఆనందోత్సాహాల మధ్య కుటుంబ సభ్యులతో కలిసి సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరారు. అలాగే పండుగ సందర్భంగా ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి, శాంతియుత వాతావరణంలో వేడుకలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రత కోసం స్థానిక పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అనంతరం ముస్లిం సాంప్రదాయాల ప్రకారం ముస్లిం నేతలు ఎస్సై ను సన్మానించారు.






