19 June, 2026 | 3:38 PM

ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ

19-06-2026 02:42 PM

ఆసిఫాబాద్(విజయక్రాంతి): ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని స్పోర్ట్స్ మోడల్ స్కూల్‌లో శుక్రవారం విద్యార్థినులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్‌వో డా. నాగేంద్ర మాట్లాడుతూ సికిల్ సెల్ అనేది హిమోగ్లోబిన్‌లో అసాధారణ అణువుల కారణంగా వారసత్వంగా సంక్రమించే రుగ్మత అని తెలిపారు.

ఈ వ్యాధి వల్ల ఎర్ర రక్తకణాలు చంద్రవంక లేదా కొడవలి ఆకారంలోకి మారి రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తాయని వివరించారు. సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులు తరచుగా రక్తహీనతకు గురవుతారని, వారికి రక్త మార్పిడి అవసరం ఏర్పడుతుందని చెప్పారు. అలాగే ఇన్ఫెక్షన్లు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. వ్యాధి బారిన పడిన వారు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.