26 February, 2026 | 12:07 AM

అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన

25-02-2026 09:57 PM

డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిభిరం

 రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత సురక్షిత ప్రయాణం

సంతోషకర గమ్యానికి సురక్షిత కంటి చూపు

 జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్

మిర్యాలగూడ,మాడుగులపల్లి,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు తెలంగాణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “అరైవ్ అలైవ్” కార్యక్రమం భాగంగా మాడుగులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా మాడుగుల పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రైవర్లకు ప్రత్యేకంగా ఉచిత నేత్ర పరీక్షలు నిర్వహించబడినవి. వాహనం నడిపే సమయంలో కంటి చూపు స్పష్టంగా ఉండటం అత్యంత ముఖ్యమని దృష్టిలో ఉంచుకొని ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరంలో నిపుణులైన నేత్ర వైద్యులు డ్రైవర్ల కంటి చూపును పరీక్షించారు. దూరం, సమీప చూపు (విజన్ టెస్ట్ ), కలర్ విజన్ పరీక్ష, కంటి ఒత్తిడి (ఐ ప్రెషర్ ) పరీక్షలు నిర్వహించారు. రాత్రి సమయంలో వాహనం నడిపే డ్రైవర్లకు ప్రత్యేకంగా నైట్ విజన్ సమస్యలపై సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్  మాట్లాడుతూ, “డ్రైవర్‌కు కంటి చూపు సరిగా లేకపోతే అది ప్రమాదాలకు ప్రధాన కారణం అవుతుంది. ప్రతి డ్రైవర్ నిర్దిష్ట కాల వ్యవధిలో ఒకసారి అయినా కంటి పరీక్ష చేయించుకోవాలని అన్నారు.

ఇది తన భద్రతతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడే చర్య” అని పేర్కొన్నారు. ఈ ఉచిత నేత్ర పరీక్షల శిబిరానికి భారీ సంఖ్యలో ఆటో, లారీ, ట్రాక్టర్, ఇతర వాహనదారులు హాజరై పరీక్షలు చేయించుకున్నారు.రోడ్డు భద్రతలో భాగంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆరోగ్య శిబిరాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే రోడ్డు ప్రమాదాలు నివారణ గురించి మాట్లాడుతూ ముఖ్యంగా రోడ్డు భద్రత నియమాలను పైన అవగాహన లోపం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. నిర్లక్ష్య డ్రైవింగ్, అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం లేకపోవడం వంటి కారణాల వల్ల జరుగుతున్నాయని తెలిపారు.

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తేనే ప్రమాదాలను తగ్గించవచ్చని ఆయన పేర్కొన్నారు. డ్రైవర్లు ప్రయాణానికి ముందు వాహనాల సాంకేతిక పరిస్థితిని తనిఖీ చేయాలని, అలసటతో లేదా నిద్రమత్తులో వాహనం నడపవద్దని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. నాలుగు చక్రాల వాహనదారులు సీట్‌బెల్ట్ ధరించాలి అని స్పష్టం చేశారు. మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ వాహనం నడపడం ప్రమాదకరమని హెచ్చరించారు. అలాగే రోడ్డు ప్రమాదంలో ప్రమాదానికి గురైన వ్యక్తులను ప్రాథమిక చికిత్స నిమిత్తం తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్లు ద్వారా సీపీఆర్ పైన అవగాహనా కల్పించడం జరిగింది.

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని,రోడ్డు వెంట ఉన్న ప్రతి గ్రామంలో రోడ్డు సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేసి వారి సూచనలు సలహాల మేరకు రోడ్డు ప్రమాదాలు నివారణకు కృషి చేస్తున్నామని, “సురక్షిత ప్రయాణం – సంతోషకర గమ్యం” అనే లక్ష్యంతో అందరూ కలిసి పనిచేయాలని జిల్లా ఎస్పీ  పిలుపునిచ్చారు. అనంతరం రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ వాహనాలు నడుపుతూ ప్రమాదాల నివారణకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు,ఎస్బి సీఐ రాము,మిర్యాలగూడ రూరల్ సీఐ పిఎన్డి ప్రసాద్, మాడుగులపల్లి ఎస్సై కృష్ణయ్య,డిటిఅర్బి రిటైర్ సీఐ అంజయ్య,ఇతర పోలీస్ అధికారులు,సిబ్బంది,మండల ఏంపిడిఓ, వంశీదర్ ఏంఆర్ఓ,సరోజ పావని వైద్య బృందం, స్థానిక ప్రజా ప్రతినిధులు,మాడుగులపల్లి సర్పంచ్ ఆరూరి నరేష్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.