2 March, 2026 | 8:32 PM

గ్రామ మహిళల స్వయం ఉపాధికి దోహదం చేసే ఉచిత శిక్షణపై అవగాహన

02-03-2026 06:49 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి గ్రామంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం (RSETI), సిరిసిల్ల వారి సహకారంతో ఉచిత మగ్గం వర్క్స్ (ఎంబ్రాయిడరీ) శిక్షణపై అవగాహన కార్యక్రమం సోమవారం విజయవంతంగా నిర్వహించబడింది. తంగళ్ళపల్లి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మార్కండేయ దేవస్థానంలో జరిగిన ఈ కార్యక్రమానికి గ్రామ మహిళలు, యువతీయువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ... గ్రామీణ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు 31 రోజులపాటు ఉచిత శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు కల్పించబడతాయని, 19 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు అర్హులని పేర్కొన్నారు. కోర్సు ప్రారంభం త్వరలోనే ఉండగా సీట్లు పరిమితంగా ఉన్నాయని తెలిపారు. మగ్గం వర్క్స్‌తో పాటు టైలరింగ్, జూట్ బ్యాగ్స్ తయారీ, బ్యూటీషియన్, ఇమిటేషన్ జ్యువెలరీ తయారీ, పచ్చళ్లు–మసాలాలు తయారీ, పుట్టగొడుగుల పెంపకం వంటి వివిధ వృత్తి శిక్షణ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయని వివరించారు.

శిక్షణలో చేరదలచిన అభ్యర్థులు 9951222306 నంబర్‌ను సంప్రదించి వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, 10వ తరగతి మెమో, నాలుగు పాస్‌పోర్టు సైజు ఫోటోలు, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ ప్రతులు అవసరమని తెలిపారు. గ్రామ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా స్వావలంబన సాధించాలని గ్రామ సర్పంచ్ మరియు పాలకవర్గం కోరారు.