బాల్య వివాహాలు అరికట్టడం అందరి బాధ్యత
గద్వాల టౌన్: బాల్యవివాహాల నిర్మూలన లక్ష్యంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గుంటిపల్లి గ్రామ పంచాయతీ ప్రాంగణంలో అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో సమాజంలో బాల్యవివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలు, చట్టపరమైన నిబంధనలు, పిల్లల హక్కుల పరిరక్షణపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వి. రాజేందర్ మాట్లాడుతూ, బాల్యవివాహాలు పిల్లల భవిష్యత్తును దెబ్బతీసే సామాజిక సమస్య అని పేర్కొన్నారు.
చిన్న వయసులో వివాహం జరగడం వల్ల పిల్లల విద్య మధ్యలోనే ఆగిపోవడం, ముఖ్యంగా బాలికల ఆరోగ్యం మరియు మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించారు. బాల్యం అనేది చదువు, ఎదుగుదల, వ్యక్తిత్వ వికాసానికి కీలక దశ అని, ఆ దశలో వివాహ బంధంలోకి నెట్టడం వారి హక్కుల ఉల్లంఘనతో సమానమని తెలిపారు. అలాగే భారతదేశంలో అమల్లో ఉన్న బాల్యవివాహాల నిరోధక చట్టాల గురించి అవగాహన కల్పిస్తూ, అబ్బాయికి కనీస వివాహ వయస్సు 21 సంవత్సరాలు, అమ్మాయికి 18 సంవత్సరాలు అని గుర్తుచేశారు.
ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. బాల్యవివాహాలను అరికట్టడంలో సమాజంలోని ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని, పిల్లల విద్యను ప్రోత్సహించడం ద్వారా మాత్రమే ఈ సమస్యను పూర్తిగా నిర్మూలించవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ శ్రీనివాసులు, లక్ష్మన్న స్వామి, సర్పంచ్ శివకుమార్, పంచాయతీ సెక్రెటరీ శశికళ, మరియు అంగన్వాడి టీచర్లు ఆశా వర్కర్లు పాల్గొన్నారు.






