25 April, 2026 | 6:53 PM

దోమల నివారణతోనే మలేరియాకు అడ్డుకట్ట

25-04-2026 05:18 PM

గద్వాల,(విజయక్రాంతి): దోమలను సంపూర్ణంగా నివారించినప్పుడే మలేరియా వ్యాధికి అడ్డుకట్ట వేసినట్లు అవుతుందని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం పురస్కరించుకొని శనివారం జోగులాంబ గద్వాల జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పాత డిఎంహెచ్ఓ కార్యాలయం వద్ద అదనపు కలెక్టర్ నర్సింగరావు ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. మలేరియా దినోత్సవ నినాదాలతో వైద్యాధికారులు, ఆశా కార్యకర్తలు పురవీధుల మీదుగా తిరిగి పాత డీఎంహెచ్ఓ కార్యాలయంకు చేరుకున్నారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నర్సింగరావు మాట్లాడుతూ ప్రపంచ మలేరియా దినోత్సవంను ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారని మలేరియా వ్యాధి నిర్మూలన, ప్రజలలో ఈ వ్యాధి పట్ల అవగాహన కలిపించడం ఈ దినోత్సవ ముఖ్యోద్దేశ్యంగా పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 106 దేశాల్లో ఏటా 3.3 బిలియన్ ప్రజలు మలేరియా బారిన పడుతున్నారన్నారు. 2012లో  మలేరియా వలన 6,27,000 మంది మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. మలేరియా 'అనాఫిలిస్' అనే ఆడ దోమ కుట్టడం వల్ల వ్యాపిస్తుందనీ, దోమలు పెరగరాదంటే మన పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు.

పాత టైర్లు, కుండలు, కూలర్లలో నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు. దోమలు ఇంట్లోకి రాకుండా కిటికీలకు మెష్‌లు అమర్చుకోవడం, దోమ తెరలు వాడటం ఎంతో అవసరమని తెలియజేశారు. సాయంత్రం వేళల్లో బయటకు వెళ్లేటప్పుడు శరీరం పూర్తిగా కప్పబడేలా దుస్తులు ధరించాలనీ, దోమలు కుట్టకుండా ఉండేందుకు క్రీములు లేదా సహజ సిద్ధమైన వేప నూనె వంటివి రాసుకోవాలన్నారు. పిల్లలు, గర్భిణీ స్త్రీల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తీవ్రమైన చలితో కూడిన జ్వరం, తలనొప్పి, వాంతులు, ఒళ్లు నొప్పులు మలేరియా ప్రధాన లక్షణాలని తెలిపారు. జ్వరం వచ్చినప్పుడు మందులు వాడినప్పటికీ తగ్గకపోతే సాధారణ జ్వరం అని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే రక్త పరీక్షలు చేయించుకోవాలన్నారు.

ప్రారంభ దశలో గుర్తిస్తే మలేరియా వ్యాధిని త్వరగా నయం చేయవచ్చన్నారు. రక్త పరీక్షలో మలేరియా అని తేలితే వైద్యులు సూచించిన మందులను సరైన సమయంలో వాడాలనీ, జ్వరం తగ్గగానే మందులు ఆపేయకూడదన్నారు. కోర్సు పూర్తిగా వాడకపోతే శరీరంలోని పరాన్నజీవులు మళ్ళీ యాక్టివ్ అయ్యే ప్రమాదం ఉందని, ప్రజలు మలేరియాపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో  డిఎంహెచ్ఓ సంధ్య కిరణ్మయి, మెడికల్ అధికారి ప్రియాంక, సబ్ యూనిట్ అధికారి శివన్న, ఎన్సిడి జిల్లా కోఆర్డినేటర్ శ్యాంసుందర్, సీసీ వెంకటేష్, ఏఎస్ఓ తిరుమలేష్ రెడ్డి, హెల్త్ ఎడ్యుకేటర్ మధుసూదన్ రెడ్డి, ఎంసిహెచ్ సూపర్వైజర్స్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.