17-02-2026 04:29:28 PM
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండి, పరీక్షలను ధైర్యంగా ఎదుర్కోవాలనే ఉద్దేశంతో అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రముఖ సైకాలజిస్ట్ కనుకుంట్ల పున్నంచందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ గురుకుల పాఠశాల బద్దెనపల్లి, నేరెళ్ల గర్ల్స్ కాలేజ్, కస్తూర్బా బాలికల విద్యాలయం, తంగళ్లపల్లి విద్యార్థులు పాల్గొన్నారు.
సదస్సులో భాగంగా డ్రగ్స్ రకాలు, వాటి వల్ల కలిగే శారీరక, మానసిక దుష్పరిణామాలపై వివరించారు. చెడు స్నేహితుల ప్రభావానికి లోనుకాకుండా లక్ష్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. పరీక్షల సమయంలో ఒత్తిడి సహజమని, సరైన ప్రణాళిక, సమయపాలన, ఏకాగ్రతతో చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. విద్యార్థులకు ప్రత్యేక కౌన్సిలింగ్ ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే సూచనలు అందించారు.
ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బత్తిని రఘు మాట్లాడుతూ డ్రగ్స్ రహిత తెలంగాణ సాధనలో యువత పాత్ర కీలకమని పేర్కొన్నారు. డ్రగ్స్ వినియోగం చట్టపరంగా నేరమని హెచ్చరిస్తూ, సమాజంలో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డా. చంద్రిక, కానిస్టేబుల్ నరేందర్, హెల్పింగ్ హార్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అల్వాల ఈశ్వర్, ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.